రామగిరి, మే 12 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి డిగ్రీ పలు సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు చేస్తున్న సమ్మె విరమించడంతో ఎంజీయూ ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నిర్వహణకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఎంజీయూ పరీక్షల నియంత్రణాధికారి జి.ఉపేందర్‌రెడ్డి సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 36 పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్‌తో జూమ్ మీటింగ్ నిర్వహించారు. పరీక్షలు పటిష్టంగా నిర్వహించాలని, ఏమైనా సమస్యలుంటే యూనివర్సిటీ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే విద్యార్థుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణకు ఆమోదం తెలిపామని ఎంజీయూ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు, నీలగిరి విద్యా సంస్థల కరస్పాండెంట్ మారం నాగేందర్‌రెడ్డి వెల్లడించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో 14, సూర్యాపేటలో 10, యాదాద్రిభువనగిరిలో 12 పరీక్ష కేంద్రాలున్నాయి. రెగ్యులర్, బ్యాక్లాగ్ విభాగంలో 2వ సెమిస్టర్లో 10,408, 4వ సెమిస్టర్లో 8,660, 6వ సెమిస్టర్లో 4,171 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. బ్యాక్లాగ్ పరీక్షలు 1వ సెమిస్టర్లో 6,066, 3వ సెమిస్టర్లో 5,109, 5వ సెమిస్టర్లో 4,171మంది హాజరవనున్నట్లు సీఓఈ ఉపేందర్‌రెడ్డి తెలిపారు.