దేవరకొండ రూరల్, జూన్ 10 : ప్రాజెక్టుల ద్వారా ప్రభావితమైన ప్రజల హక్కులు, జీవన ఉపాధి ప్రభుత్వ బాధ్యత అని, భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. వివిధ ప్రాజెక్టుల కింద నిర్వాసితులైన బాధితులకు మంగళవారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెక్కులను అందజేశారు. ముదిగొండ రోడ్డు వద్ద పెద్దగట్టు 10 మంది లబ్ధిదారులకు రూ.13 లక్షలు, అంబా భవాని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన రైతులు 30 మందికి రూ.32 లక్షలు, నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న వారి పునరావాసం కోసం చింతపల్లి గ్రామం వద్ద నిర్మించ తలపెట్టిన ఆర్ అండ్ ఆర్ కాలనీ కోసం సేకరించిన భూముల రైతులు తొమ్మిది మందికి రూ.84 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భూ నిర్వాసితుల కష్టాలను పరిష్కరించడంలో ప్రభుత్వం కీలక భూమిక పోషిస్తుందన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ పడతామని హామీ ఇచ్చారు. నక్కలగండి ప్రాజెక్టు రిజర్వాయర్ ముంపు నిర్వాసితులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం పరిహారం అందిస్తుందని తెలిపారు. అనంతరం నియోజక వర్గంలో నిర్మాణంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పురోగతిపై, భూ సేకరణ, ఫారెస్ట్ అనుమతులు తదితర అంశాలపై క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, ఫారెస్ట్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్సీ భద్రు, ఈఈ నెహ్రూ నాయక్, రాములు నాయక్, యాదన్ కుమార్, సత్యనారాయణ, ఎస్డీసీ యూనిట్ -1 నీల, డీఎఫ్ఓ రాజశేఖర్, ఆర్డీఓ రమణా రెడ్డి, ఎఫ్డీఓ సంగీత, డీఈలు, ఏఈలు, ఫారెస్ట్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.