కోదాడ రూరల్, సెప్టెంబర్11 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోదాడ మండలంలో తీవ్ర నష్టం జరిగింది. వరదలకు పంట పొలాలు మునిగాయి. రోడ్లు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నది. పలు చోట్ల చెరువులకు గండ్లు పడడంతో పొలాలన్నీ ఇసుక మేటలతో నిండాయి. తీవ్ర నష్టం జరుగడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మండల పరిధిలోని ఎర్రవరంలో వరదలకు చెరువు కట్ట తెగి పంట పొలాలు నీట మునిగాయి.
వరద నీటితో ప్రసిద్ధ దుళ్లగుట్ట బాల ఉగ్రనరసింహ స్వామి దేవాయల ప్రాంగణంలోని దుకాణదారులు సామగ్రి తడవడంతో భారీగా నష్టపోయారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు కూడా కూలిపోయాయి. దీనికి తోడు గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారి విష జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరదలు వచ్చి 10 రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు గ్రామానికి ఒక్క అధికారి, ప్రజాప్రతినిధులు రాలేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునిగిన పొలాలు, దుకాణాలను చూసే వారే లేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ చెరువు కట్ట నిర్మాణం చేపట్టకపోవడంతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు.
నాలుగు ఎకరాల్లో ఇసుకమేట వేసింది
నాకున్న నాలుగు ఎకరాల్లో వరద పారి పూర్తిగా ఇసుక మేట వేసింది. ఎకరానికి 17 వేలు చొప్పున పెట్టుబడి పెట్టి రెక్కల కష్టంతో పొలం నాటుపెట్టినం. మా బాధలు తెలుసుకునేందుకు ఇంత వరకు ఏ అధికారి వచ్చిన పాపన పోలేదు. పొలంలో ఇసుక మేట తొలగించడానికే ఎక్కువ ఖర్చు అయ్యేట్లుగా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి.
– కాకి ప్రసాద్, రైతు, ఎర్రవరం, కోదాడ మండలం
ప్రభుత్వం ఆదుకోవాలి
వరదలకు మా పొలాలు కొట్టుకుపోయాయి. ఈ సారి మొత్తం నష్టమే మిగిలింది. వరద బాధితులను పరామర్శించేందుకు ఇప్పటి వరకు మా గ్రామానికి ఏ అధికారి, నాయకులు రాలేదు. మా నష్టం, మా బాధలు పైఅధికారులకు ఎలా తెలుస్తాయి. ఇప్పటికైనా సార్లు వచ్చి మునిగిన పంట పొలాలు పరిశీలించాలి
-బంటి వెంకట నర్సమ్మ, ఎర్రవరం, కోదాడ మండలం