యాదాద్రి భువనగిరి, జూలై 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ శాఖలను గాలి కొదిలేసింది. సంక్షేమ శాఖ పరిధిలో ఉండే వసతి గృహాలను పట్టించుకోవడమే మానేసింది. ఫలితంగా జిల్లాలో హాస్టళ్లు మూతబడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం మూడు హాస్టళ్లు మూతబడటం సర్కారు అలసత్వానికి నిదర్శనం. మరికొన్ని బంద్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఒకే సారి మూడు బంద్..
కారణాలు ఇవీ..
గతంలో హాస్టళ్లలో సీటు కావాలంటే తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్సయ్యింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. సర్కారు హాస్టళ్లలో ప్రధానంగా కనీసం సదుపాయాలు కరువయ్యాయి. అరకొర వసతులతో హాస్టళ్లు నడుస్తున్నాయి. కొన్ని చోట్ల పాత భవనాలు, అద్దె బిల్డింగ్లలో కొనసాగుతున్నాయి.
ఇక మెనూ, నాణ్యమైన భోజనం అందడంలేదు. స్థానికంగా వార్డెన్లు, ఇన్చార్జిలు ఉండటంలేదు. ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరుసగా పదుల సంఖ్యలో ఫుడ్ పాయిజన్ అయిన సంఘటనలు ఉన్నాయి. భువనగిరి ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. రోజురోజుకు హాస్టళ్లపై తల్లిదండ్రులకు నమ్మకం తగ్గుతున్నది. దాంతో పేరెం ట్స్ విద్యార్థులను హాస్టళ్లకు పంపించడం లేదు. దీన్ని సర్కారు సాకుగా చూపిస్తూ ఒక్కొక్కటిగా హాస్టళ్లను బంద్ చేస్తున్నది.
మరికొన్ని మూసివేతకు ప్లాన్..!
జిల్లాలోని హాస్టళ్లలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించడం లేదు. కొన్ని చోట్ల ఈ ఏడాది ఒక్కరు కూడా చేరలేదని తెలుస్తున్నది. సుమారు 3వేల సీట్లు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. మోత్కూరు, తుర్కపల్లి, ఆత్మకూరు (ఎం) బాలికలు, రామన్నపేట, చౌటుప్పల్లోని బీసీ హాస్టళ్లలో అడ్మిషన్లు తీసుకునేందుకు విద్యార్థులు ముందు కు రాలేదు. ఇక విద్యార్థులు తక్కువగా ఉన్న మరికొన్ని హాస్టళ్లు మూసేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. మరికొన్ని చోట్ల తక్కువ విద్యార్థులు ఉన్న వసతి గృహాలను దగ్గరలో ఉన్న హాస్టళ్లలో విలీనం చేసేంందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం కొత్తగా గురుకులాలు, హాస్టళ్లు పెంచుకుంటూ పోతే.. కాంగ్రెస్ సర్కారు బంద్ చేసుకుంటూ పోవడం ఏంటని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.