HomeNalgondaThe Birth Anniversary Of Late Film Actor Dr Prabhakar Reddy In Chitrapuri Colony Of Manikonda Municipality
చిత్రపురికి నాంది… ప్రభాకర్‌రెడ్డి
తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్న తెలంగాణ ముద్దుబిడ్డగా సినీనటుడు దివంగత డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి చిరస్మరణీయుడిగా నిలిచారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మణికొండ మున్సిపాలిటీ చిత్రపురికాలనీలో దివంగత సినీనటుడు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం నిర్వహించారు.
హాజరైన రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
మణికొండ, జూలై 1 : తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్న తెలంగాణ ముద్దుబిడ్డగా సినీనటుడు దివంగత డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి చిరస్మరణీయుడిగా నిలిచారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మణికొండ మున్సిపాలిటీ చిత్రపురికాలనీలో దివంగత సినీనటుడు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరై ప్రభాకర్‌రెడ్డి విగ్రహాన్ని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, కాలనీ అధ్యక్షుడు అనిల్ వల్లభనేనిలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ప్రభాకర్‌రెడ్డి సతీమణి సంయుక్తను శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చిత్రసీమకు ప్రత్యేక స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. నల్లగొండ బిడ్డగా దివంగత డాక్టర్ యం. ప్రభాకర్‌రెడ్డి మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తెలుగు చిత్రసీమను తరలించే సమయంలో కార్మికుల సంక్షేమంపై ముందుకు చూపులో ఆలోచించిన వ్యక్తి అన్నారు.
చిత్రసీమలో పనిచేసే 24క్రాఫ్ట్స్ కార్మికులకు సొంతిండ్లు ఉండాలనే ఆకాంక్షలతో అప్పటి ప్రభుత్వాలను ఒప్పించి చిత్రపురికాలనీకి స్థలాన్ని కేటాయింపజేశారన్నారు. ఆనాటి కొండలు, గుట్టలుగా ఉన్న చిత్రపురికాలనీ నేడు బహుళఅంతస్తుల నిర్మాణంలో సినీ కార్మికుల సొంతింటి కల నెరవేరిందన్నారు. కార్మికుల పక్షపాతిగా కృషిచేసిన ప్రభాకర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని చిత్రపురికాలనీ వాసులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మా నల్లగొండ బిడ్డ ఇవ్వాళ తెలుగు చిత్రసీమ కార్మికుల సంక్షేమం కోసం శ్రమించి గుర్తింపు సాధించడం గర్వంగా ఉందని చెప్పారు. గొప్ప వ్యక్తులు ఎలా ఉంటారంటే ప్రభాకర్‌రెడ్డిని గురించి చెబితే చాలన్నారు. తెలంగాణ చిత్ర పరిశ్రమ ఉండటానికి ఇలాంటి గొప్ప వ్యక్తులు కృషి,త్యాగమే కారణమన్నారు. డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని మంత్రి కోరారు.
అనేక చిత్రాల్లో ప్రతి నాయకుడిగా నటనలో ప్రతిభ చూపారని చిత్రపరిశ్రమ కార్మికులకు ప్రభాకర్‌రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు రంజిత్‌రెడ్డి అన్నారు. చిత్రపురికాలనీని సమిష్టి కృషితో అభివృద్ధి పర్చేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ బిడ్డగా సినీపరిశ్రమకు గుర్తింపు తీసుకువచ్చిన వారిలో ప్రభాకర్‌రెడ్డికి ప్రత్యేకత ఉందని గుర్తుచేశారు. చిత్రపురికాలనీలో ప్రభాక్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలపడం గొప్పవిషయమని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. చిత్రపురికాలనీ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రపురికాలనీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు అనిల్‌కుమార్ వల్లభనేని, కౌన్సిలర్ హైమాంజలి, కాలనీ ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ యాదవ్, కార్యదర్శి పీఎస్ఎన్ దొర, సభ్యులు లలిత, కాదంబరి కిరణ్, మహానందరెడ్డి, ప్రసాదరావు, రామకృష్ణ ప్రసాద్, రఘుబత్తుల, దీప్తి వాజ్‌పేయి, అనిత నిమ్మగడ్డ, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కె.రామకృష్ణారెడ్డి, పార్టీ అధ్యక్షుడు
బి.శ్రీరాములు,మాజీ ఎంపీపీ మల్లేశ్, నాయకులు శ్రవణ్‌కుమార్, శ్రీకాంత్, సదానంద, డి.ఎస్.రెడ్డి పాల్గొన్నారు.