హుజూర్నగర్, అక్టోబర్ 25 : రాష్ట్రంలోని యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. హుజూర్నగర్ జాబ్ మేళా భారతదేశంలోనే అరుదైన కార్యక్రమం అన్నారు. సుమారు 275 కంపెనీలు హుజూర్‌నగర్‌కు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే పేరుపొందిన కంపెనీలు ఈ జాబ్ మేళాకు హాజరైనట్లు చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విస్తృత ప్రచారం కల్పించినట్లు వెల్లడించారు. అందుకు తగ్గట్టుగానే భారీ స్పందన వచ్చిందని, ఇందుకు సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామీణ ప్రాంతంలో సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, తెలుగు మీడియంలో చదవడం వల్ల గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించే అవకాశం దొరికిందన్నారు. ఇలాంటి జాబ్ మేళాల ద్వారా ప్రజల జీవితాల్లో సమూల మార్పులను తీసుకురావచ్చని, ఉద్యోగాలు కల్పించడం ద్వారా కుటుంబాలు బాగుపడతాయని తెలిపారు. 275 కంపెనీలు, 40 వేల మందికి ఇంటర్వ్యూలు నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. ఇంటర్వ్యూలకు హాజరైన వారు ఉద్యోగాల్లో చేరే వరకు తాము నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. జాబ్ మేళాను విజయవంతం చేయడంలో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ, సింగరేణి కాలరీస్, జిల్లా యంత్రాంగం, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం సహకరించిన అందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, సర్వోత్తమ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Huzurnagar : యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయం : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి