అర్వపల్లి, జూన్ 29 : సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురంలో సోమవారం జరిగిన పాల కేంద్రం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ ప్రక్రియ ముగిసి రెండు గంటలు గడిచినా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కౌంటింగ్ కు బీఆర్ఎస్ ఏజెంట్లు హాజరు కాగా కాంగ్రెస్ ఏజెంట్లు హాజరు కాలేదు. దీంతో ఇరుపార్టీల ఏజెంట్లు హాజరైతేనే కౌంటింగ్ ప్రారంభిస్తామని అధికారులు అనడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య హోరా హోరీగా నినాదాలు వాగ్వాదాలు జరిగాయి. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ మారిపెద్ది భవాని, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ మాట్లాడుతూ.. స్థానిక సీఐ నాగేశ్వరరావు ఎన్నికల నిర్వహణలో పక్షపాత ధోరణితో వ్యవహరించారని ఆరోపించారు.
పోలింగ్ ముగిసిన అనంతరం పోలింగ్ బాక్సులను అధికార పార్టీ నాయకులకు అప్పగించారని వారు ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు సీఐ నాగేశ్వరరావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆలస్యం చేయకుండా పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను కోరారు. ఓట్ల లెక్కింపు మరుసటి రోజుకు వాయిదా పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల నాయకులతో పోలీసులు చర్చలు జరుపుతూ శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చూస్తున్నారు.