– చాకలి ఐలమ్మ జయంతి – కవి సమ్మేళనం వేడుకలో కవులు, రచయితలు
– తెలంగాణ సాయుధ పోరాటన్ని పాఠ్యాంశంలో చేర్చాలి – మునాస్ వెంకట్
రామగిరి, సెప్టెంబర్ 26 : ప్రపంచ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం ఒక మైలురాయిగా నిలిచిందని ప్రముఖ కవులు, రచయితలు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ సాహితి ఉమ్మడి నల్లగొండ యూటీఎఫ్ భవన్లో తెలంగాణ సాహితి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి – సాయుధ పోరాట స్ఫూర్తి అనే అంశంపై శుక్రవారం సాయంత్రం కవి సమ్మేళనం నిర్వహించారు. ఇందులో భాగంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ప్రముఖ కవి, రచయిత, తెలుగు అధ్యాపకుడు డాక్టర్ కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆంధ్ర మహాసభ భారత కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దొరల గడీల దౌర్జన్యాన్ని నిలదీసిందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, తన నాలుగెకరాల భూమి కోసం లక్ష ఎకరాల ద్వారా విసునూరి రామచంద్రారెడ్డిపై తిరగబడ్డ చాకలి ఐలమ్మ సాహసం నేటి తరానికి మార్గదర్శకం అన్నారు. నాటి పోరాట చైతన్య స్ఫూర్తిని నేడు కవులు ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజా చైతన్యంలో ఆనాడు సుద్దాల హనుమంతు, బండి యాదగిరి లాంటి కవులు వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించారన్నారు.
తెలంగాణ జీవకవి మునాసు వెంకట్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతం మొదటి నుంచి ఉద్యమాలకు పుట్టినిల్లుగా నిలిచిందన్నారు. 1946 నుండి 1951 వరకు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తదనంతర కాలంలో ప్రపంచ ఉద్యమాలకు గొప్ప స్ఫూర్తిని కలిగించిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన కథలు, పాటలు ఆనాటి చరిత్రను రికార్డు చేశాయన్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చరిత్ర వక్రీకరణ జరుగుతున్న నేటి తరుణంలో వాస్తవ చరిత్రను ముందు తరాలకు అందించాలన్నారు.
తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పేరుమాల్ల వెంకటేశం, కార్యదర్శి నలపరాజు వెంకన్న, ప్రముఖ కవులు, రచయితలు డాక్టర్ పగడాల నాగేందర్, డాక్టర్ చింతోజు మల్లికార్జున చారి, డాక్టర్ సాగర్ల సత్తయ్య, బూర్గు గోపికృష్ణ, పెరిమల్ల ఆనంద్, మహమ్మద్ హసేన, మాదగాని శంకరయ్య, దాసరి శ్రీరాములు, బండారు శంకర్, టాప్రా జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి శ్యాంసుందర్, నిమ్మల బీమార్జున్ రెడ్డి, గద్దపాటి రేణుక పాల్గొన్నారు.
Ramagiri : ప్రపంచ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం ఒక మైలురాయి