కోదాడ, సెప్టెంబర్ 15 : రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం పదేండ్ల కాలంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి పెరిగి దేశంలోనే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. సోమవారం కోదాడ మేళ్లచెరువు కాశీనాధం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కోదాడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రేపాల ప్రసాదరావు సంతాప సభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి ఉత్పత్తిలో సూర్యాపేట జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. దేశంలో లక్ష బిలియన్ టన్నుల వరి పంట పండితే తెలంగాణలో ఒక కోటి యాభై లక్షల టన్నుల పంట ఉత్పత్తితో అగ్రస్థానంలో ఉందన్నారు. దీంతో పాటు ఆసియా ఖండంలోని అత్యధిక ఫార్ బాయిల్డ్ రైస్ మిల్లులు ఉమ్మడి జిల్లాలో ఉన్నట్లు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో రైస్ మిల్లుల ద్వారా రూ.4 వేల కోట్ల వ్యాపారం జరిగితే ఒక్క కోదాడలోనే రూ. వెయ్యి కోట్ల వ్యాపారం జరుగుతుందన్నారు. ఈ పరిశ్రమ 4 వేల మందికి జీవనోపాధి కల్పిస్తుందన్నారు. తెలంగాణలో 3,400 రైస్ మిల్లులు ఉంటే ఉమ్మడి జిల్లాలో 250 ఉన్నట్లు చెప్పారు. కోదాడ నియోజకవర్గంలో వర్షాధారంతోనూ, సాగర్ ఆయకట్టుతోను వరి విపరీతంగా పండుతుందన్నారు. రేపాల ప్రసాదరావు, చిన్నపరెడ్డి, గుండపనేని నారాయణరావు, సుబ్బారెడ్డిల కృషితో మిల్లర్స్ అసోసియేషన్ భవన నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. వ్యాపార, వ్యవసాయ రంగాల్లో కోదాడ వేగవంతంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు పరిశ్రమల అభివృద్ధి కోసం కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో వ్యవసాయ డిగ్రీ కళాశాలతో పాటు వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి చేయాలని కోరారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రముఖ వైద్యుడు జాతి సుబ్బారావు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో రైస్ మిల్లు వ్యవస్థను అగ్రగామిగా నిలిపిన ఘనత రేపాల ప్రసాదరావుకు దక్కుతుందన్నారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన రేపాల స్నేహశీలి అన్నారు. ఈ సమావేశంలో విశ్రాంత తెలుగు అధ్యాపకులు శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు, డాక్టర్ రామారావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బాధ్యులు చక్కెర చిన్నపరెడ్డి, పైడిమర్రి వెంకటనారాయణ, రామినేని శ్రీనివాస్, ఆవుల రామారావు, చెన్నకేశవరావు, గంధం బంగారు, రేపాల ప్రసాదరావు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు.