ఆత్మకూర్.ఎస్, మార్చి 15 : భీంరెడ్డి నర్సింహారెడ్డి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సూర్యాపేట ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆత్మకూర్.ఎస్ మండలం దాచారంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎంపీ భీంరెడ్డి నర్సింహారెడ్డి శత దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు తుమ్మల పెన్‌పహాడ్ ఎక్స్ రోడ్డులో ఏర్పాటు చేసిన బీ.ఎన్.విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో బీ.ఎన్.స్మారక గ్రంథాలయాన్ని ప్రారంభించి సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సమాజం స్వేచ్ఛగా ఉందంటే దానికి కారణం బీ.ఎన్.పోరాట ఫలితమే అని అన్నారు. వితంతువును వివాహామాడిన ఆదర్శమూర్తి భీంరెడ్డి నర్సింహారెడ్డి అన్నారు. అంతా అభిమానంతో బీ.ఎన్.గా పిలుచుకునే భీమిరెడ్డి నర్సింహారెడ్డికి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక పుట ఉందని గుర్తు చేశారు. రాజకీయంగా విభేదించినా బీ.ఎన్ను అభిమానించే లక్షలాది మందిలో నేను ఒకడిని అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బీ.ఎన్ స్పూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
బీఎన్ కలలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే
తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకురావాలనే బీఎన్ చిరకాల వాంఛను నేరవేర్చిన ఖ్యాతి, ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు. ఆంధ్ర కమ్యూనిస్టు నాయకుల మోసానికి బలైన నాయకులు బీఎన్ అన్నారు. బీఎన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు చిరస్మరణీయమన్నారు. ప్రాజెక్టులకు బీ.ఎన్ పేరు నామకరణం చేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఆత్మకూర్.ఎస్ మండల ఎంపీపీ స్వర్ణలతాచంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్, మాజీ ఎంపీపీ బ్రహ్మం, శిల్పి శ్రీనివాస్‌రెడ్డి, బీఎన్ కుమారుడు ప్రభాకర్‌రెడ్డి, మేనళ్లులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.