టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడైన డాక్టర్ చెరుకు సుధాకర్ తిరిగి తన సొంత పార్టీకి చేరుకున్నారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆయన్ని ఆహ్వానించారు. సుధాకర్‌తోపాటు ఆయన భార్య లక్ష్మి, కుమారుడు డాక్టర్ సుహాస్, అనుచరులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరోసారి 12కు 12 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్21 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన డాక్టర్ చెరుకు సుధాకర్ తిరిగి బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్లో కీలక నేతగా పనిచేశారు. అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. ఉద్యమ సమయంలో అనేక సార్లు మిలిటెంట్ తరహా పోరాటాలకు సారథ్యం వహించారు. ఒక సందర్భంలో నకిరేకల్‌లో హైవే దిగ్భందనం చేస్తూ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లడంలో తనదైన పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో పీడీ యాక్టుకు గురైన ఏకైక నేతగా నిలిచారు.
అలాంటి నేత 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నుంచి వీడి బయటకు వెళ్లారు. అనేక రాజకీయ వేదికలతో కలిసి పనిచేసే ప్రయత్నం చేశారు. సొంతంగా తెలంగాణ ఇంటి పార్టీని కూడా ఏర్పాటు చేశారు. చివరకు దాన్ని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేస్తూ అందులో చేరారు. కానీ ఎక్కడా తనదైన శైలి రాజకీయాలు కనపడలేదు. చివరకు కాంగ్రెస్‌లోని ఆధిపత్య భావజాలంతో పాటు బీసీలను వెక్కిరించే ధోరణులు, అవమానాలను భరించలేక ఆ పార్టీని వీడారు. తెలంగాణ సమాజంపై తన ఆలోచణ విధానానికి బీఆర్ఎస్నే సరైన వేదిక అని తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని భావిస్తూ బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెరుకు సుధాకర్ చేరికలో కీలక భూమిక పోషించారు. ఇటీవలే ఉద్యమకారులంతా తిరిగి బీఆర్ఎస్లోకి చేరుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే జిట్టా బాలకృష్ణారెడ్డి, ఏపూరి సోమన్న, పల్లె రవికుమార్ తదితరులంతా బీఆర్ఎస్లోకి వచ్చారు. వీరితో పాటు తాజాగా చెరుకు సుధాకర్ బీఆర్ఎస్లోకి రావడం పార్టీలో ఉద్యమకారుల పునరేకీకరణ జరుగుతుందన్న చర్చ మొదలైంది. చెరుకు సుధాకర్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తూ కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులంతా బీఆర్ఎస్లోకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఎన్నికల్లో హాట్రిక్ విజయం సాధిస్తామని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలన్నారు. తన చేరిక సందర్భంగా డాక్టర్ చెరకు సుధాకర్ మాట్లాడుతూ ‘నా ఆలోచన విధానాన్ని పదును పట్టిన తెలంగాణ భవన్లో, నా శక్తికి పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న అనేక విషయాలను తెలియజేసిన అధినేత కేసీఆర్ సారథ్యంలో ఇవ్వాళ బీఆర్ఎస్లో మీ మధ్య మాట్లాడుతున్నందుకు సంతోషిస్తున్న. 2014లో నేను పార్టీని వీడి వెళ్ళిన. బీఆర్ఎస్ తన గుండె చప్పుడు కొనసాగించాలని, తెలంగాణ ప్రజల గుండె చప్పుడగా ఎల్లప్పుడూ ఉండాలని భావిస్తున్న.
పదేళ్ల ప్రస్తానంలో అనేక పాఠాలతో, వ్యతిరేకులకు అనేక గుణపాఠాలు చెప్పిన బీఆర్ఎస్.. భవిష్యత్తులోనూ తెలంగాణ ప్రజల ఆయువు పట్టుగా ఉండాలి. ప్రజలకు మరింత చేరువ కావాలని, అభివృద్ధి ముందుకు తీసుకుపోవాలని, ఆ అభివృద్దిలో నాకు భాగస్వా మ్యం అయ్యే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.’ అంటూ చెరుకు సుధాకర్ ముగించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నకిరేకల్, ఆలేరు ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, రాష్ట్ర గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న పాల్గొన్నారు.