దామరచర్ల, జులై 8: ప్రభుత్వం ప్రకటించిన మెనూ విధిగా అమలు పరచాలని తహసీల్దార్ బానోతు జవహర్ లాల్ పేర్కొన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు బోధన పద్ధతులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహించబడే పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన పౌష్టిక ఆహారం అందించాలని తెలిపారు.
నోటీస్ బోర్డుపై ప్రతిరోజు మెనూ రాయాలని, స్టోర్ రూమ్ లో ఆహార పదార్థాలు తీసుకునే సందర్భంలో విద్యార్థినిల భాగస్వామ్యం ఉండాలని తెలిపారు. పాఠశాల పరిసరాలు మరుగుదొడ్లు నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బాలికలు అనారోగ్య బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. డిజిటల్ పద్ధతిలో విద్యాబోధన చేయటం ద్వారా కఠినమైన అంశాలు కూడా సులభంగా విద్యార్థినిలకు అర్థమవుతాయని ఉపాధ్యాయులు బోధన అభ్యసన ప్రక్రియలలో విరివిగా డిజిటల్ తరగతులను వినియోగించుకోవాలని సూచించారు. వారి వెంట మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్, ప్రత్యేక అధికారిని కవిత తదితరులు ఉన్నారు.