– కార్యక్రమం జరిగిన ప్రాంతంలోనే పడేసిన వైనం
– ఇదేం నిర్వహణ అంటూ పలువురి మండిపాటు
రామగిరి, డిసెంబర్ 03 : నల్లగొండ జిల్లా విద్యాశాఖ- సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ నెల 1న డిస్ట్రిక్ట్ లెవెల్ రోల్ ప్లే కాంపిటీషన్-2025′ నిర్వహించారు. అయితే జిల్లాలోని ప్రభుత్వ, కేజీబీవీ ఇతర కొన్ని పాఠశాల నుంచి మాత్రమే విద్యార్థులు హాజరై తమ నైపుణ్యాలు ప్రదర్శించారు. కార్యక్రమ ముగింపు అనంతరం విద్యార్థులకు డీఈఓ బొల్లారం భిక్షపతి, కాంపిటీషన్ నిర్వహణ కోఆర్డినేటర్ సంతకాలతో కూడిన సర్టిఫికెట్స్ అందజేశారు. కాగా ఆ సర్టిఫికెట్లు కార్యక్రమం జరిగిన చోటనే చించి పడవేశారు. సర్టిఫికెట్స్ ను స్వీకరించిన కేజీబీవీ- హాలియా (అనుముల) విద్యార్థులు, సంబంధిత ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల చిత్తశుద్ధి దీంతో బహిర్గతమైంది.
జిల్లా విద్యాశాఖ – సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతి మాసంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహణ చేస్తున్నారు. వాటిలో విద్యార్థులకు పలు అంశాలపై పోటీలు, ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం నిధులను సమృద్ధిగా మంజూరు చేస్తుండడంతో సంబంధిత అధికారులు మామ అనిపించేలా కార్యక్రమాల నిర్వహణ చేస్తూ ఇష్టానుసారంగా నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత నిధుల ఖర్చులకు తప్పుడు లెక్కలను చూపిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. ఇష్టానుసారంగా కార్యక్రమానికి హాజరు కానటువంటి వారికి సైతం హాజరైనట్లుగా నమోదు చేస్తూ అధికారులు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని స్పష్టమవుతుంది. ఈ విషయంలో సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.