నల్లగొండ, ఫిబ్రవరి 2 : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే నెల 29తో ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల 29న షెడ్యూల్ విడుదల చేయగా నేడు నోటిఫికేషన్ జారీ చేయనుంది. నల్లగొండ కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తూ ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉమ్మడి మూడు జిల్లాల పరిధిలోని అభ్యర్థులు నల్లగొండలోనే నామినేషన్లు వేయనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు తీసుకోనున్నారు. ఈ నెల 11న స్క్రూట్నీ, 13న ఉపసంహరణ అనంతరం 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఫలితాలను లెక్కించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల యంత్రాంగం జిల్లాలో 200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, ఆయా పోలింగ్ కేంద్రాల్లో 24,905 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును
వినియోగించుకోనున్నారు.
ఫలితాల లెక్కింపు కూడా నల్లగొండలోనే..
పోలింగ్ అనంతరం కౌంటింగ్ కూడా నల్లగొండలోనే నిర్వహించనున్నారు. కౌంటింగ్‌కు సంబంధించి ఆర్జాలబావిలోని గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల్లో మొత్తం 12 జిల్లాలు ఉండగా నల్లగొండ కలెక్టర్ ఆర్వోగా, ఇతర జిల్లాల కలెక్టర్లు ఏఆర్వోగా వ్యవహరించనున్నారు. ఉమ్మడి మూడు జిల్లాల్లో 24,905 మంది ఉపాధ్యాయ ఓటర్లకుగానూ నల్లగొండలో 4,483, సూర్యాపేటలో 2,637, యాదాద్రిలో 9,21, సిద్దిపేటలో 163, జనగామలో 921, హన్మకొండలో 5,098, వరంగల్‌లో 2,225, మహబూబాబాద్‌లో 1,618, భూపాలపల్లిలో 323, ములుగులో 612, భద్రాద్రిలో 1,949, ఖమ్మంలో 3,955 మంది ఉన్నారు.