‘పేద వాడు చదువుకు చేరువ కాకపోతే.. చదువే పేదవాడి చెంతకు వెళ్లాలి’ అనే స్వామి వివేకానంద సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కస్తూరి శ్రీచరణ్. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన శ్రీ చరణ్ గతంలో ఓప్రైవేట్ కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు పేద విద్యార్థులు ఫీజు కట్టలేక విద్యకు దూరమవుతున్న సందర్భాలను చూసి చలించిపోయాడు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతుండటంతో మనస్సు తరుక్కుపోయింది. పేద పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో 2017 సంవత్సరంలో కస్తూరి ఫౌండేషన్‌ను స్థాపించారు. నాటి నుంచి నిరంతరం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తూ పుస్తకాలు, బ్యాగులు, ఇతర మెటీరియల్‌ను అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర జిల్లాలోనూ..
స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ఐదేండ్లకుపైగా పేదల చదువుల ఉన్నతికి శ్రీచరణ్ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోనూ పేద విద్యార్థులకు చదువుకు తోడ్పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నారు. వాటితోపాటు 2022 సంవత్సరంలో అంగన్వాడీల అభివృద్ధి, బాలికల విద్యకు ప్రాధాన్యం కల్పిస్తూ సేవా కార్యక్రమాలను ప్రారంభించారు.
శ్రీ చరణ్ సేవా కార్యక్రమాలు
ప్రతి సంవత్సరం ఆర్థికంగా ఇబ్బందులు పడే పేద విద్యార్థులతోపాటు మైనారిటీ విద్యార్థుల చదువుకు సాయం చేస్తున్నారు. 120మంది ఇంటర్, ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌తోపాటు పలు కోర్సులు చదివే విద్యార్థులకు ఉచితంగా ఫీజులు చెల్లిస్తున్నారు.
పేద విద్యార్థుల భవిష్యతే లక్ష్యం
పేద విద్యార్థులు చదువుకు దూరం కావద్దనే లక్ష్యంతో కస్తూరి ఫౌండేషన్‌ను ప్రారంభించాను. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోనే బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్యావకాశాలు అందుతాయనే సంకల్పంతో సర్కారు పాఠశాలల్లో మరమ్మతులు చేయిస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నాం. చదువులో రాణించాలని పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్, పరీక్ష సామగ్రిని పంపిణీ చేస్తున్నాం. పేదల ఉన్నత విద్యకు సహకరిస్తున్నాం. భవిష్యత్‌లో సేవా కార్యక్రమాలను విస్తరించి ముందుకెళ్తాం.
-కస్తూరి శ్రీ చరణ్, కస్తూరి ఫౌండేషన్ చైర్మన్