నీలగిరి, అక్టోబర్ 27 : ఒకే రాష్ట్రం.. ఒకే పోలీస్ నివాదంతో ప్రారంభమైన బెటాలియన్ కానిస్టేబుళ్ల పోరాటం రోజురోజుకూ ఉధృతం అవుతున్నది. సోమవారం నల్లగొండ శివారులోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో మొదలైన పోరాటం రాష్ట్రమంతటా విస్తరించింది. అదే రోజు కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై రాస్తారోకోకు దిగగా.. అందుకు బాధ్యులుగా ఆరుగురు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దాంతో ఆందోళన మరింత తీవ్రతరమై సచివాలయం ముట్టడి వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. కానిస్టేబుళ్ల పోరాటంతో దిగివచ్చిన ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురిపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. కాగా, శనివారం శాంతియుతంగా ధర్నా చేసిన మరో ఐదుగురి కానిస్టేబుళ్లు ఎన్.శ్రీనివాస్ యాదవ్, ఆర్.హనుమానాయక్, బి.వెంకటేశ్వర్లు, ఏ.రాములు, ఎస్కే షఫీని సస్పెండ్ చేయడంతో అదివారం మళ్లీ ఆందోళన చేపట్టారు. ఆదివారం సెలవు రోజు అవడంతో కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఇంటిల్లిపాది రోడ్డెక్కి నిరసన తెలిపారు. పిల్లలు సైతం బెటాలియన్‌లోని అన్ని రహదారుల్లో చిన్నారులు తిరుగుతూ నినాదాలు ఇచ్చారు. బెటాలియన్‌లో ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేస్తారనే ముందు జాగ్రత్తతో సివిల్ పోలీసులు బెటాలియన్ ఎదుట భారీగా మోహరించారు.