చివ్వెంల, మార్చి 29 : నాడు నీళ్ల కోసం పోరాటం మొదలైంది సూర్యాపేటలోనేనని పేటకు మళ్లీ నీటి కష్టాలు వస్తాయనుకోలేదని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, ప్రముఖ రచయిత జూలూరు గౌరీ శంకర్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని మొగ్గయ్యగూడెంలో ఎండిన పంట పొలాలను పరిశీలించి మాట్లాడారు. రైతుల కష్టాలు చూస్తుంటే కన్నీలోస్తున్నాయన్నారు. ఇటీవల మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కన్నీళ్లు పెట్టింది చూసి నమ్మలేకపోయామని, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తే సూర్యాపేట రైతుల ఆవేదన అర్థమైతుందన్నారు. స్వరాష్ట్ర ఉద్యమంలో కాంగ్రెస్ నాయకుల ఇంటి ముందు చావు డప్పు కొట్టినోళ్లం ఇవాళ రైతుల కోసం మళ్లీ ఉద్యమాలు చేయడానికి వెనుకాడమని తెలిపారు.
రైతులవి ప్రభుత్వంపై విమర్శలు కాదని వాళ్ల ఆవేదన అన్నారు. నీళ్లకు కూడా రాజకీయాలుంటాయా అని ఆయన ప్రశ్నించారు. చేతికొచ్చిన పంట ఎండితే పశువుల మేతకు అమ్ముకుంటున్నామని బాధపడుతున్నారని, ట్రాక్టర్లలో కూలీలను తీసుకురావాల్సిన పరిస్థితి పోయి గొర్రెలు, మేకలను తీసుకొచ్చి మేపుకునే పరిస్థితి దాపురించిందన్నారు. ఊర్లు వలసలు పోయే పరిస్థితి మళ్లీ రావడం బాధాకరం అన్నారు. రాజుగా బతకాల్సిన రైతులు దినసరి కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా రైతంగాన్ని ఆదుకునేందుకు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు యుద్ధ ప్రాతిపదికన పనిచేసి నీళ్లిచ్చి ఆదుకోవాలని కోరారు.
సీనియర్ సంపాదకుడు టంకశాల అశోక్ మాట్లాడుతూ.. సూర్యాపేట రైతుల ఆవేదన కలచివేసిందన్నారు. పొట్టదశలో పంటలు ఎండిపోతున్నాయని ఒకసారి నీళ్లు వదిలితే పంటలు చేతికొస్తాయన్నారు. రైతుల నోట అబద్దాలు రావు.. వాళ్ల ఆవేదన కనబడుతుంది. పంట నష్ట పరిహారం పోయిన ఏడాదే ఇంకా రాలేని.. ఈసారైనా ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నట్లు తెలిపారు. ఎట్లున్న తెలంగాణ ఎట్లా మారిందని ప్రజలంతా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. రైతులను గోసపెట్టిన ఏ ప్రభుత్వం ముందుకు సాగలేదన్నారు. ఇప్పటికైనా స్పందించి రైతుల కష్టాలు తెలుసుకుని ఒక్క తడికన్నా నీళ్లివ్వాలని కోరారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, హైకోర్టు న్యాయవాది ఉపేందర్, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంతుల మధు, జిల్లా నాయకులు వాసు, నగేశ్, రైతులు వీరభద్రయ్య, నారాయణరెడ్డి, లక్ష్మీ, వాల్య, వినయ్, బాలు పాల్గొన్నారు.
water shortage : సూర్యాపేటకు మళ్లీ నీటి కష్టాలు వస్తాయనుకోలేదు : జూలూరు గౌరీ శంకర్