సూర్యాపేట, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విజయం సాధించారు. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ రికార్డుల్లోకి ఎక్కారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఆదివారం జరిగిన శాసనసభ ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్‌రెడ్డి 75,143 ఓట్లు సాధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిపై 4,606 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలువగా, మూడో స్థానంలో బీజేపీ నిలిచింది.
20 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించగా.. ఒకటి రెండు మినహా ప్రతి రౌండ్లోనూ బీఆర్ఎస్ ఆధిక్యత కనబరిచింది. చివరకు ఫలితాల వెల్లడిలో ఎలాంటి టెన్షన్ లేకుండా బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. తొమ్మిదిన్నరేండ్లుగా చేసిన అభివృద్ధి, సంక్షేమాలను చూసిన ప్రజలు.. మూడోసారీ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదరించి అండగా నిలిచారు.
కాంగ్రెస్, బీజేపీ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. సూర్యాపేటలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేయగా.. అదే నిజమైంది. జగదీశ్‌రెడ్డికి 75,143 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి 70,537, బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్రావుకు 40,407 ఓట్లు పోలయ్యాయి.