సూర్యాపేట, ఫిబ్రవరి 25 : పారద్శకమైన పాలనతోపాటు మారుతున్న కాలానికనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సూర్యాపేట కలెక్టరేట్ సిద్ధమవుతున్నది. జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్. వెంకట్రావ్ సరికొత్త పాలనకు సిద్ధమయ్యారు. కలెక్టర్ కార్యాలయంలో ఈ ఆఫీస్ విధానం అమలు చేసేందుకు చర్యలను తీసుకుంటున్నారు. కాగితపు రహితంగా అన్ని పనులు జరిగేలా ఈ ఆఫీస్ విధానం అమలు చేయనున్నారు. ఈ నెల 27 నుంచి రెవె న్యూ శాఖలో మొదటిసారిగా ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
శాఖా పరరంగా గానీ, ఇతర అత్యవసర ఫైల్స్‌ను వేగంగా పరిష్కరించడానికి ఈ ఆఫీస్‌లో రెడ్ టిక్ పెట్టి పంపనున్నారు. రెడ్ టిక్ చూసిన సంబంధిత అధికారులు తక్షణమే ఆ ఫైల్‌ను పరిష్కరించాల్సి ఉంటుంది. ఇలా ఈ ఆఫీస్ విధానంలో పారదర్శకంగా సమస్యల పరిష్కారానికి వెసులుబాటు ఉంటుంది. ఒక అధికారి తన వద్దకు వచ్చిన ఫైల్‌పై సంతకం చేయకుండా ఆపితే ఎందుకు ఆపారో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఫైల్స్ క్లియర్ కావడానికి ఈ ఆఫీస్ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉండబోతున్నది.
నూతనంగా విధులో చేరిన కలెక్టర్ ఎస్ వెంకట్రావ్ నెల రోజుల వ్యవధిలోనే పాలనలో తన దైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా ప్రజావాణిలో వెబ్ ఎక్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. వెబ్ఎక్స్ ద్వారా మండలాధికారులతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. అంతేకాకుండా వివిధ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించేందుకు రోజుల వారీగా వివిధ శాఖలకు కేటాయించారు. ప్రభుత్వ ప్రాధాన్య పనుల్లో వేగం పెంచేందుకు నేరుగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పాలనలో తనదైన ప్రత్యేక ముద్ర వేస్తున్నారు.
రెవెన్యూ శాఖలో సమస్యల పరిష్కారానికి దరఖాస్తు దారుడు నేరుగా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుంటాడు. ఆ దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ సంబంధిత సెక్షన్‌కు పంపిస్తారు. ఆ తర్వాత కాపీ నేరుగా ఇన్ వార్డులో ఇస్తే వారు స్కాన్ చేసి సదరు సెక్షన్‌కు పంపిస్తారు. అప్పటి నుంచి ఆ ఫైల్ ఈ ఆఫీస్ విధానం ద్వారా స్టెప్ బై స్టెప్ ఆయా సెక్షన్ అధికారుల వద్దకు వస్తుంది. చివరికి అధికారి సంతకంతో ఫైల్ క్లోజ్ అవుతుంది. ఇన్ వార్డులో దరఖాస్తు ఇచ్చినప్పుడే దరఖాస్తుదారుడికి ఈ ఆఫీస్ నంబర్ అందజేస్తారు. ఆ నెంబర్ ద్వారా తన ఫైల్ ఏ స్థాయిలో ఉందో ఈ ఆఫీస్ విధానంలో దరఖా స్తుదారుడు తెలుసుకునే వీలు కలుగుతుంది.
ఈ ఆఫీస్ విధానాన్ని ఈ నెల 27న విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. అందుకు తగినట్టు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు.