ఈ ఏడాది సాగు లక్ష్యం నిర్దేశించిన అధికార యంత్రాంగంనల్లగొండ జిల్లాలో 1500, సూర్యాపేటలో 1500 ఎకరాలురైతులకు రాయితీలు, శిక్షణ ఇస్తున్న ప్రభుత్వం మూస ధోరణికి స్వస్తి పలికి లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పంటల మార్పిడిని ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణానికి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 600, సూర్యాపేట జిల్లాలో 212 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతుండగా ఈ ఏడాది మరో 3 వేల ఎకరాలకు పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే రెండు జిల్లాల్లో
పర్యటించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు నల్లగొండలో 56,845, సూర్యాపేటలో 65,750 ఎకరాల భూములు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని తేల్చారు. దీంతో అధికార యంత్రాంగం ఆసక్తి ఉన్న రైతులకు శిక్షణ ఇవ్వడానికి, అవగాహన పర్యటనకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దీనికోసం ప్రభుత్వం జిల్లాకు రూ.5 లక్షల చొప్పున కేటాయించింది.
సూర్యాపేట, ఆగస్టు 16 : రాష్ట్రంలో రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. మూస ధోరణితో వ్యవసాయం చేసి ఆర్థికంగా నష్టపోతున్న రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లించి అధిక లాభాలను పొందే విధంగా చూస్తున్నారు. రెండేండ్ల క్రితం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉద్యానవన శాస్త్రవేత్తలు పర్యటించి సూర్యాపేట జిల్లాలో 65,750 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 56,845 ఎకరాలు ఆయిల్ పామ్ సాగుకు అనువైన భూమి ఉందని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉద్యానశాఖ అధికారులు రెండు జిల్లాల్లో 1,500 ఎకరాల చొప్పున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసే విధంగా లక్ష్యం పెట్టుకున్నారు. సూర్యాపేట జిల్లాకు కేటాయించిన 1,500 ఎకరాల్లో జనరల్ కేటగిరి రైతులకు 1,105 ఎకరాలు కేటాయించగా ఎస్సీ రైతులకు 275, ఎస్టీ రైతులకు 120 ఎకరాలు కేటాయించారు. నల్లగొండ జిల్లాకు సైతం కేటగిరి వారీగా కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ఆయిల్ పామ్ సాగు చాలా తక్కువగా ఉంది. సూర్యాపేట జిల్లాలో 212 ఎకరాలు , నల్లగొండ జిల్లాలో 700 ఎకరాల్లో సాగవుతుంది.
అయిల్ పామ్‌లో రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. నాలుగేండ్ల పాటు హెక్టారుకు రూ.32 వేల రాయితీ రైతుకు అందిస్తారు. మొదటి సంవత్సరం మొక్కల కోసం రూ.12 వేలు రాయితీ ఉండగా నాలుగేండ్ల పాటు ఏడాదికి 5వేల చొప్పున రూ.20 వేలు ఎరువులకు ఇవ్వనున్నారు. ఐదేండ్ల నుంచి పంట దిగుబడి వస్తుండడంతో రైతుకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. ఐదో సంవత్సరం కూడా అంతర్గత పంటల సాగుకు రూ. 5 వేలు అందజేస్తారు. మొదటి సంవత్సరం రైతుకు భారం కాకుండా దాదాపు 85 శాతం సబ్సిడీ కింద ఇస్తుండగా మిగితా ఐదేండ్లు 50 శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. వీటితో ఎరువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. డ్రిప్ కూడా ప్రభుత్వం రాయితీతో అందజేస్తున్నది. ఎస్సీ,ఎస్టీలకు 100 శాతం రాయితీ, మిగతా వారికి 90 శాతం రాయితీతో
డ్రిప్ ఇస్తున్నది.
అధిక విటమిన్లు ఉండే ఈ నూనెను వంటలో ఎక్కువగా ఉపయోగించడం వల్ల బహిరంగ మార్కెట్లో మంచి ధర ఉన్నది. ఒక హెక్టార్లో 143 మొక్కలు నాటవచ్చు. ఒక చెట్టుకు రోజు 200 లీటర్ల నీరు అవసరం పడుతుంది. సాగు ప్రారంభించిన నాలుగేండ్ల తరువాత రైతుకు నికర ఆదాయం ప్రారంభమవుతుంది. ఒక టన్ను రూ.15 నుంచి16 వేల వరకు మద్దతు ధర ఉన్నది. ఈ పంటలకు చీడపీడల బెడద చాలా తక్కువగా ఉంటుంది. పంట చేతికి రావడం ప్రారంభమైన తరువాత భూసారం సైతం పెరుగుతుంది. ప్రతికూల వాతావరణంలో సైతం తట్టుకుటుంది. కూలీల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. కోతులు, దొంగల బెడద ఉండదు. ఆయిల్ పామ్ పంట మధ్యలో మరో అంతర పంట వేయడం వల్ల రైతుకు మరో రకంగా ఆదాయం వస్తుంది.
రైతులను ప్రోత్సహించడంతోపాటు వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రైతులకు అవగాహన, శిక్షణ తరగతులు, పర్యటనల కోసం ఒక్కొక్క జిల్లాకు ఐదు లక్షల చొప్పున పది లక్షలను కేటాయించింది. వీటితో ఆయిల్ పామ్ అధికంగా సాగు చేసే ప్రాంతాలకు రైతులను తీసుకుపోయి అవగాహన కల్పిస్తున్నారు.
ఆయిల్ పామ్‌కు ఇప్పుడు మంచి మద్దతు ధర వస్తుంది. టన్ను రూ.15నుంచి రూ.16 వేల వరకు మద్దతు ధర ఉన్నది. దీంతో రైతులు ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం జిల్లాకు 1500 ఎకరాలు ఆయిల్ పామ్ సాగు చేయించే విధంగా రైతులను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టాం. రైతులు సైతం మంచి ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.22 లక్షల ఎకరాల భూమి ఆయిల్ పామ్‌కు అనుకూలంగా ఉంటుందని ఉద్యానవన శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీంతో రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదు.