సూర్యాపేట టౌన్/రూరల్/బొడ్రాయిబజార్, జూలై 9 : సూర్యాపేట జిల్లాకు ప్రపంచ చిత్ర పటంలో ప్రత్యేక చోటు దక్కాలని, అందుకు అనుగుణంగా ప్రజలంతా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. హరిత తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారం మహాయజ్ఞంలా కొనసాగుతూ అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని 29వ వార్డులో మొక్కలు నాటిన అనంతరం 22వ వార్డులో మున్నూరు కాపు శ్మశాన వాటికను పరిశీలించారు. పుల్లారెడ్డి చెరువు వద్ద వైకుంఠధామం, జమునానగర్‌లో డంపింగ్ యార్డు, నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్పీజీ బర్నింగ్ యూనిట్లను ఆయన పరిశీలించారు. ఖాళీ ప్లాట్లలో చెత్తను తొలగించి మొక్కలు పెంచుకునేలా యజమానులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమల బెడద అధికంగా ఉంటున్నందున ప్రజలు తమ ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటింటికీ మొక్కల పంపిణీ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. అలాగే సద్దుల చెరువు ట్యాంక్‌బండ్‌ను నందనవనంలా మార్చే పనులు కొనసాగుతున్నాని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు అనంతుల యాదగిరి, రాపర్తి శ్రీనివాస్‌గౌడ్, చింతలపాటి భరత్ మహాజన్, సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ, వెంపటి సురేశ్, టీఆర్ఎస్ నాయకులు రాంగిరి నగేశ్, ఉప్పల ఆనంద్, వేణుగోపాల్‌రెడ్డి, దుర్గయ్య, నాగయ్య, బాలసైదులు, రాంబాబు పాల్గొన్నారు.
చెక్ డ్యామ్ పరిశీలించిన మంత్రి..
రాయిన్‌గూడెం గ్రామ సమీపంలోని మూసీ నదిపై నూతనంగా నిర్మించిన చెక్‌డ్యామ్‌ను మంత్రి పరిశీలించారు. చెక్‌డ్యామ్ కోసం తాము కోరిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.120 కోట్లు మంజూరు చేశారన్నారు. 700ఎకరాల పరిధిలో సాగు పెరిగేలా జిల్లాలో మొత్తం 16చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ భిక్షం, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు, వెంకట్‌రెడ్డి, దశరథ పాల్గొన్నారు.