రామగిరి (నల్లగొండ), మే 28 : నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి బి.బాలమ్మ సురవరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణపై వివక్షతను ఆనాడే ఎదిరించి గోల్కొండ పత్రిక ద్వారా తెలంగాణ సాహితీ ఆత్మ గౌరవాన్ని సురవరం చాటారని కొనియాడారు.
నేటి యువతరం ఆయనను స్ఫూర్తిగా తీసుకుని జీవిత లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థలు నిరుద్యోగ యువతకు అవసరమైన పోటీ పరీక్షల అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాహితీ మేఖల సంస్థ కార్యదర్శి పున్న అంజయ్య, కవి కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గ్రంథాలయ సిబ్బంది కట్టా నాగయ్య, నరసింహారెడ్డి, పాఠకులు పాల్గోన్నారు.