ఆత్మకూర్.ఎస్, డిసెంబర్ 24 : రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. కోటేశ్వర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కందగట్ల గ్రామంలో నిర్వహించిన అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల పాలనలో వ్యవసాయరంగాన్ని విస్మరించి కార్పొరేట్ సంస్థలకు ఎర్ర తివాచీ పరిచి అనుకూల విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. సంగ్ పరివార్ శక్తుల సైద్ధాంతిక పాలన కొనసాగిస్తూ అణగారిన వర్గాలపై దాడులకు పూనుకుంటున్నారని విమర్శించారు. కార్పొరేట్ శక్తుల బ్యాంకు రుణాలను రూ. 11 లక్షల కోట్లకుపైగా మాఫీ చేశారు. కానీ రైతాంగానికి ఎలాంటి బ్యాంకు రుణాలను మాఫీ చేయలేదని దుయ్యబట్టారు. మోదీ పాలనలో ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పొడు భూములకు హక్కులు కల్పించడం లేదన్నారు. రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వంపై రైతు కూలీలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిల భాతర రైతుకూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి డేవిడ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, జిల్లా కమిటీ సభ్యుడు పెద్దింటి రంగారెడ్డి, మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కాశయ్య, నాగయ్య, దశరథ, సైదులు, కిరణ్‌కుమార్, వెంకన్న, గిరిబాబు, ఉదయగిరి, ఉమేశ్, వీరన్న, శ్రీను, లింగయ్య, వెంకటకృష్ణ, భరత్, వంశీ పాల్గొన్నారు.