– తండ్రి మరణంపై కుమారుడి ఆరోపణ
– నిందితుడిపై చర్యలకు పోలీసుల తాత్సారం?
– చర్యలు తీసుకోవాలని బాధితుడి డిమాండ్
దేవరకొండ రూరల్, జనవరి 16 : దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన నయన్ భాస్కర్ ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన తండ్రి ఆత్మహత్యకు వ్యాపార భాగస్వామి చేసిన ఆర్థిక మోసాలు, వేధింపులే కారణమని భాస్కర్ కుమారుడు అజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం దేవరకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి నయన్ భాస్కర్ గత మూడు దశాబ్దాలుగా మార్పాకుల కుటుంబంతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. గత 11 ఏళ్లుగా అశోక్ గౌడ్ అనే వ్యక్తితో కలిసి ఫెర్టిలైజర్ షాపును నడుపుతున్నాడు. తన తండ్రి చిట్టీల వ్యాపారం ద్వారా సంపాదించిన సొమ్మునంతా సదరు దుకాణంలోనే పెట్టుబడిగా పెట్టాడు. అయితే గత కొంతకాలంగా వ్యాపార లెక్కల విషయంలో అశోక్ గౌడ్ మోసం చేస్తున్నాడని, అసలు పెట్టుబడి అడిగితే ఇవ్వకుండా మానసికంగా వేధించాడని అజయ్ ఆరోపించాడు.
వేధింపులు భరించలేక తన తండ్రి ఫెర్టిలైజర్ షాపులోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. చనిపోయే ముందు “నా చావుకు మార్పాకుల అశోక్ గౌడ్ కారణం” అని తన తండ్రి రాసిన లేఖను అజయ్ చూపించాడు. ఇంతటి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మధ్యవర్తిత్వం వహిస్తామని నమ్మించిన సురేశ్ గౌడ్ వంటి వారు కూడా తమను మోసం చేశారన్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిందితుడిపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరాడు.