కట్టంగూర్, అక్టోబర్ 10 : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నల్లగొండ డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి కార్డులు, భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలల్లో జరుగుతున్న గుణాత్మక విద్యా కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు తీరుతెన్నులతో పాటు విద్యార్థులచే పాఠ్య పుస్తకాలు చదివించి వారి పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాల పరిసరాలతో పాటు మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పదో తరగతి విద్యార్థులను ఇప్పటి నుంచే పరీక్షలకు సిద్ధం చేసి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యార్థులను దత్తత తీసుకుని ప్రతి సబ్జెక్టులో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఉపాధ్యాయులు భోదించే పాఠ్యాంశాలను విద్యార్థులు శ్రద్ధగా విని పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. పాఠశాలలో వంద శాతం ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట పాఠశాల ఇన్చార్జి ఎంఈఓ అంబటి అంజయ్య, అయా పాఠశాలల హెచ్ఎం కందాల రమ. ఘనపురం భీమయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్, నరహరి, పుల్లయ్య, నగేష్ ఉన్నారు.