యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ):కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లను గాలికొదిలేసింది. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను పట్టించుకోవడం మానేసింది. కనీసం పిల్లలకు ఖర్చు పెట్టే మెస్సు బిల్లులు కూడా విడుదల చేయడంలేదు. బిల్లులు నెలల తరబడి పెండింగ్లోనే ఉన్నాయి. ఒక్కోశాఖలో లక్షల కొద్దీ నిధులు పేరుకుపోయాయి. దీంతో పిల్లల కు నాణ్యమైన ఆహారం అందని ద్రాక్షగానే మారుతోంది. కాస్మోటిక్ చార్జీలు కూడా అందడం లేదు. గురుకుల పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
10 నెలలుగా బిల్లులు బంద్..
యాదాద్రి భువనగిరి జిల్లాలో 19 ప్రీమెట్రిక్ ఎస్సీ హాస్టళ్లు నడుస్తున్నాయి. ఇందులో 11 బాలురు, 8 బాలిక వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో సుమారు 1,500 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మెస్సు బిల్లులే రాలేదు. నెలకు 15 లక్షలకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంటుం ది. ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖ పరిధిలో రూ.కోటికి పైగా పెండింగ్లో ఉన్నాయి. ఇక బీసీ హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో 15 హాస్టళ్లు ఉండగా, సుమారు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి జనవరి నుంచి బిల్లులు రావాలి. సుమారు 10 నెలలుగా నిధుల్లేవు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 8 ఎస్టీ హాస్టళ్లు ఉండగా, సుమారు 700 మంది విద్యార్థులు ఉన్నారు. గిరిజన సంక్షేమ వసతి గృహాల్లోనూ ఐదుల నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు. ప్రభుత్వం సకాలంలో నిధులు చెల్లించకపోవడంతో బిల్లుల చెల్లింపుల్లో వార్డెన్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కూరగాయలు, చికెన్, గ్యాస్, గుడ్లు, అరటి పండ్లు, పాలు తదితరాల కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బిల్లులు రూ.లక్షల్లో పేరుకుపోతుండటంతో కిరాణా దుకాణ యజమానులు కూడా ఉద్దెర ఇవ్వడం లేదని వార్డెన్లు వాపోతున్నారు.
గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి..
బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన గురుకులాలు ఇప్పుడు అధ్వానంగా తయారయ్యాయి. కనీసం విద్యార్థుల బిల్లులను కూడా చెల్లించలేని దుస్థితి దాపురించింది. జిల్లాలో 15 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మూడు మైనార్టీ, నాలుగు బీసీ, ఎనిమిది ఎస్సీ గురుకులాలు ఉన్నాయి. వీటితో ఒక ఆశ్రమ పాఠశాల కూడా ఉంది. ఐదు నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో నిత్యావసరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. ఇటీవల ఓ కాంట్రాక్టర్ ఏకంగా తన బాధను వెళ్లగక్కుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరలైంది.
కాస్మోటిక్ చార్జీలేవీ..?
విద్యార్థులకు చెల్లించే కాస్మోటిక్ చార్జీలు కూడా ఇప్పటి వరకు అందలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో బీసీ, ఎస్సీ హాస్టళ్ల పిల్లలకు కాస్మోటిక్ చార్జీలు ఒక్క పైసా చెల్లించలేదు. సుమారు ఏడు నెలల నుంచి బిల్లులు రావాల్సి ఉంది. 3 నుంచి 7వ తరగతి బాలురకు నెలకు రూ.150, బాలికలకు రూ.175, 8 నుంచి 10వ తరగతి పిల్లలకు బాలురకు రూ.200, బాలికలకు రూ.275 ఇవ్వాలి. అవి కూడా చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి బిల్లులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నాణ్యమైన భోజనమేదీ..?
రాష్ట్ర ప్రభుత్వం 3 నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులకు నెలకు రూ.1,330, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1,540 చెల్లిస్తున్నది. బిల్లులు పెండింగ్లో ఉండటంతో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదని తెలుస్తున్నది. బిల్లులు రాలేదని వార్డెన్లు ఉన్నదాంట్లోనే సరిపెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం రాత్రి భోజనంతో పాటు వారానికి ఒకసారి చికెన్, మూడు రోజులు కోడిగుడ్లు, అరటి పండ్లు ఇస్తారు. నిత్యావసరాల ధరలు పెరగడంతో పాటు బిల్లులు రాక మెనూ ప్రకారం ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. నాణ్యమైన భోజనం లభించకపోవడంతో విద్యార్థుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.