కొండమల్లేపల్లి, ఆగస్టు 26 : కొండమల్లేపల్లి మండలం కొలుముంతలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో గల కేజీబీవీ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న వైష్ణవి, భాను ఇద్దరు విద్యార్థినులు ఇంటిపై బెంగతో కళాశాల హాస్టల్లో ఉండలేక తరచు ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించేవారుగా సమాచారం. గతంలో కూడా నాలుగు ఐదు సార్లు కడుపు నొప్పిగా ఉందని ఇంటికి వెళ్లొచ్చినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. సదరు విద్యార్థినులు మంగళవారం రాత్రి తమ వద్ద ఉన్న సూపర్ వాస్మోల్ పేళ్ల మందు తాగడంతో వాంతులు చేసుకున్నారు. వాంతులు చేసుకుంటుండగా ద్వితీయ సంవత్సరం చదువుతున్న బంగారి అనే విద్యార్థిని తోటి విద్యార్థులకు సమాచారం ఇచ్చి వసతి గృహం సిబ్బందికి తెలిపింది. వెంటనే ఆ ఇద్దరు విద్యార్థినులను చికిత్స కోసం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం విద్యార్థినుల పూర్తిగా కోల్పోవడంతో వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారితో ఇంటికి పంపినట్లు పాఠశాల ఎస్ఓ సరళ తెలిపారు.
కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు రసాయనం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు చేసిన ఆరోపణల ప్రకారం లెక్చరర్ల వేధింపులు, తరగతి గదిలో పరుష పదజాలంతో దూషించడం, చదువులో వెనుకబడుతున్నామనే ఒత్తిడి వంటి కారణాలతో వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎన్సీ, సంబంధిత లెక్చరర్లపై విచారణ జరిపి, తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కొలుముంతలపాడు కేజీబీవీలో పేళ్ల మందు తాగిన విద్యార్థినులు