రామగిరి, నవంబర్ 06 : బాల్య దశలో అయోడిన్ లోపం వల్ల కలిగే నష్టాలపై నల్లగొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల- దేవరకొండ రోడ్లో గురువారం ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ (ఐజిడి) ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. గ్లోబల్ అయోడిన్ డెఫిషియన్సీ ప్రివెన్షన్ డే నిర్వహించి ఐ జి డి జిల్లా కో ఆర్డినేటర్ డి.సురేశ్ బాబు మాట్లాడారు. అయోడిన్ లోపం వల్ల గాయిటర్, హైపో థైరాయిడిజం, సంతానోత్పత్తి సమస్యలు, గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం, నెలలు నిండకుండానే ప్రసవం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. అంతేకాకుండా మెదడు అభివృద్ధి లోపాలు, పిండం, ముఖ్యంగా మెదడు ఆరోగ్యకరమైన అభివృద్ధికి అయోడిన్ చాలా ముఖ్యమని, అయోడిన్ లోపం వల్ల మెదడు దెబ్బతినవచ్చు (క్రెటినిజం) అన్నారు.
చర్మం, జుట్టు, గోళ్ల సమస్యలు, అభిజ్ఞా లోపాలు (మెదడు పనితీరులో సమస్యలు) వచ్చే అవకాశం ఉందన్నారు. అయోడిన్ లోపం నివారణకై అయోడిన్ కలిపిన ఉప్పు వాడాలన్నారు. సీ ఫుడ్, డైరీ ఉత్పత్తులు, గుడ్లు, అయోడిన్ కలిపిన పాల ఉత్పత్తులను తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు యూసఫ్ ఉద్దీన్, ఉపాధ్యాయులు సందీప్, ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.

Ramagiri : అయోడిన్ ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన