రామగిరి, నవంబర్ 17 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలోకి విద్యార్థులు తమ సొంత పుస్తకాలను లోపలికి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ గతంలోనే సర్కులర్ జారీ చేశారు. అయితే లైబ్రరీలోని పుస్తకాలతో పాటు తమకు అవసరమైన సొంత పుస్తకాలను సహితం అనుమతించాలని, వాటిని సహితం లైబ్రరీలో కూర్చుని చదువుకునేలా అనుమతివ్వాలని కొంతకాలంగా విద్యార్థులు నిరసన చేస్తున్నారు. అయితే వర్సిటీ అధికారులు భీష్మించి సర్కూలను కొనసాగించడంతో సోమవారం వర్సిటీ బీఆర్ఎసీ విద్యార్థి నాయకుడు వాడపల్లి నవీన్, ఏబీబీపీ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఎస్సీ, బీసీ విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు లైబ్రరీ ఎదుట ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్సిటీ జారీ చేసిన సర్కూలర్ ఉపసంహరించుకోవాలని, తమ సబ్జెక్టులతో పాటు ఇతర పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు చదువుకునేలా అనుమతించాని పలు పర్యాయాలు వీసీ, రిజిస్ట్రార్‌కు వినతి పత్రాలు సమర్పించినా స్పందన లేదన్నారు. దీంతో ఆందోళనకు దిగినట్లు తెలిపారు. ఆందోళన నేపథ్యంలో వర్సిటీ సెంట్రల్ లైబ్రరీ అధికారి విద్యార్థులు సొంత పుస్తకాలు సహితం లైబ్రరీలోకి తెచ్చుకుని చదువుకోవచ్చని లిఖిత పూర్వంగా ఉత్తర్వులు అందించడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

Ramagiri : ఎంజీయూ వర్సిటీ సెంట్రల్ లైబ్రరీలోకి సొంత పుస్తకాలతో విద్యార్థులకు అనుమతి