కొండమల్లేపల్లి, జూన్ 15 : బడిబాట పట్టిన తొలిరోజే ఓ విద్యార్థి ప్రమాదానికి గురై ప్రాణపాయ స్థితికి చేరుకున్న ఘటన సోమవారం కొండమల్లేపల్లిలో చోటు చేసుకుంది. వేసవి సెలవుల అనంతరం సోమవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న క్రమంలో స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల అవరణను అందంగా అలంకరించేందుకు ఉపాధ్యాయులు సిద్ధమాయ్యారు. దీంతో పాఠశాల గేటుకు మామిడాకులతో తోరణం కట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పాఠశాల పక్కనే ఆడుకుంటున్న ఓ విద్యార్థిని తోరణం కట్టేందుకు సాయంగా రమ్మని ఉపాధ్యాయుడు శ్రీధర్ పిలిచారు.
దీంతో ఆ విద్యార్థి వచ్చి కాంపౌండ్ వాల్ ఎక్కి తోరణం కడుతుండగా పక్కనే ఉన్న 33 కేవీ విద్యుత్ లైన్ తీగలు తగిలి షాక్‌తో గోడపై నుంచి కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ విద్యార్థిని నాంపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన కొత్తగొల్ల శేఖర్- జ్యోతి దంపతుల కుమారుడు కొత్తగొల్ల రాంచరణ్(13)గా గుర్తించారు. రాంచరణ్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ప్రమాదం జరిగి వెంటనే ఉపాధ్యాయులు, స్థానికులు ఆ విద్యార్థిని అత్యవసర చికిత్స నిమిత్తం దేవరకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించినట్లు మండల విద్యాధికారి నాగేశ్వరరావు తెలిపారు. పాఠశాల ప్రారంభం రోజే ప్రమాదం జరగడంతో విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంగా ఓ ఓ విద్యార్థి ప్రాణాలకు ముప్పు ఏర్పడిందంటూ పలువురు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల జీతాలు తీసుకొని ఉపాధ్యాయులకు పాఠశాలకు తోరణం కట్టాడాని చేతకాలేదా.. అని స్థానికులు ఆరోపిస్తున్నారు. సిబ్బందితో కాకుండా పిల్లలతో పని చేయించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, ఈ సంఘటనకు కారకుడైన ఉపాధ్యాయుడు శ్రీధర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్ధి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రధానోపాధ్యాయుడిపై విమర్శలు..
ఇదిలా ఉండగా ప్రమాదం జరిగిన సమయంలో హెచ్ఎం పాఠశాలలో లేకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. పాఠశాలకు ఎవరు వచ్చినా హెచ్ఎం అందుబాటులో ఉండడంలేదని ఆరోపణలు ఉన్నాయి. పాఠశాల ఇంచార్జీయే ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని పలువురు ఆరోపిస్తున్నారు. హెచ్ఎం అందుబాటులో ఉండకుండా ఇతర పాఠశాలల్లో తనిఖీకి వెళ్లినట్లు ఉపాధ్యాయులతో చెప్పిస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రధానోపాధ్యాయుడికి వత్తాసు పలుకుతుండటం గమనార్హం.
విచారణకు కలెక్టర్ ఆదేశం
ఈ ఘటనపై విచారణ చేపట్టాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు దేవరకొండ ఆర్డీవో పద్మప్రియ సోమవారం సాయంత్రం ఘటనా స్థలాన్ని పరిశీలించి ఘటనకు గల కారణాలను హెచ్ఎంతో పాటు, విద్యుత్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గంటలోగా అన్ని వివరాలతో కూడిన నివేదికను తనకు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడి అదేశించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల సమీపంలో విద్యుత్తు లైన్లు వేలాడుతుంటే తొలగించాలని, అధికారులకు సూచించారు. ఆమెవెంట ఎండీడీవో స్వర్ణలత, తాసీల్దార్ నరేందర్, ఆర్ఐ శ్రీనివాస్, విద్యుత్ ఏఈ దేవుజనాయక్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలి
విద్యార్థి రాంచరణ్ విద్యుత్ షాక్‌కు కారణమైన ఉపాధ్యాయడు శ్రీధర్‌ను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు. దేవరకొండలోని సంజీవని దవాఖానలో చికిత్స పొంతున్న విద్యార్థి రాంచరణ్‌ను పరామర్శించారు. విద్యార్థితో పనలు చేయించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను కోరారు. అయన వెంట బీఆర్ఎస్వీ నాయకులు జమీర్ బాబా, అనిల్ పాల్గొన్నారు.