రామగిరి, జూన్ 20 : ఆసియా అండర్- 23 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌నకు భారత దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు నల్లగొండలోని చర్లపల్లిలో గల తెలంగాణ సాంఘీక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల (TGSWRDCW) విద్యార్ధిని ప్రవళిక నరిమళ్ల ఎంపికైంది. జూలై 8 నుండి 13వ తేదీ వరకు చైనాలోని ఓర్డోస్ నగరంలో జరిగే పోటీల్లో విద్యార్థిని పాల్గొంటుందని కళాశాల ప్రిన్సిపాల్ డా.పవిత్ర వాణి కర్ష వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రవళిక తల్లిదండ్రులు రాంబాబు తాపీ మేస్త్రి కాగా తల్లి విజయ వ్యవసాయ కూలీగా పని చేస్తున్నట్లు తెలిపారు. భారతీయ 4×400 మీటర్ల రిలే జట్టులో సభ్యురాలిగా ఎంపికైన ప్రవళిక, కళాశాలకు, జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి గొప్ప గౌరవం తెచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. దీంతో ప్రవళికను కళాశాల పీడీ టి.లక్ష్మీ, స్పోర్ట్స్ అకాడామి కోచ్ పరశురామ్, డిగ్రీ కళాశాలల ఓఎస్ఓ, ఉన్నత విద్యామండలి డా.స్నేహలత, యాదాద్రి భువనగిరి జోన్ అధికారిణి విద్యారాణి, నల్లగొండ జిల్లా డీసీఓ శోభారాణి, అధ్యాపకులు అభినందించారు.