భువనగిరి కలెక్టరేట్, ఫిబ్రవరి 6 : తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా వసతి గృహాల నిర్వహణ ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హనుమంతు జెండగే వార్డెన్లు, అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ప్రభుత్వ వసతి గృహాల వార్డెన్లు, సంక్షేమ అధికారులతో కలిసి వసతి గృహాల పనితీరును సమీక్షించారు. వార్డె న్లు స్నేహ పూర్వక వాతావరణంలో విద్యార్థుల ఆరోగ్యకరమైన విషయాలను పంచుకోవాలని, గార్డియన్గా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఇచ్చే ఫిర్యాదులను అలక్ష్యం చేయవద్దని, విద్యార్థుల్లో అభద్రతాభావం కలుగకుండా చూడాలని తెలిపారు. సాయంత్రం 5 గంటల తరువాత ఎవరినీ వసతి గృహాల్లోకి అనుమతించవద్దని, కూరగాయలు, వసతులు సమకూర్చే వారిని సైతం పగటి సమయాల్లోనే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా విద్యార్థుల్లో మనోధైర్యం పెరిగేలా కృషి చేయాలన్నారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున ప్రతి ఒక విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎ.భాసర్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యాంసుందర్, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారి యాదయ్య, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు, ఆశ్రమ పాఠశాలల ప్రిన్సిపాల్స్, వసతి గృహాల వార్డెన్లు పాల్గొన్నారు.