చివ్వెంల, మార్చి 26 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక రంగం కుదేలైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కాలం తెచ్చిన కరువు కాదు ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువేనని ఆయన అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మొగ్గయ్యగూడెంలో ఎండిన పంట పొలాలను పరిశీలించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తూ రాక్షసానందం పొందుతున్నదన్నారు. దోచుకోవడం.. పంచుకోవడం.. దాచుకోవడం.. ఈమూడే కాంగ్రెస్ సిద్ధాంతాలని అన్నారు. పదేండ్లు ప్రశాంతంగా ఉన్న రైతాంగాన్ని మళ్లీ కన్నీళ్ల పాలుచేసిన పాపం కాంగ్రెస్ దేనన్నారు. పొట్టకొచ్చిన పంటలను నీళ్లులేక పశువులకు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని, కనీసం ఒక్క తడి ఇస్తే సగం పంటైనా దక్కేదన్నారు. ఏడాదిన్నర కాకముందే అన్నిరంగాల్లో ఇంత నిర్లక్ష్యమా అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రారంభించిన తర్వాత ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు, కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత రెండుసార్లు యాసంగి పంటలు ఎండిపోయినట్లు చెప్పారు. కాళేశ్వరం కాకుండా ఎస్సారెస్పీ నీళ్లే అయితే ఇప్పుడు పంటలు ఎందుకు ఎండుతున్నాయో మంత్రులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మళ్లీ కాళేశ్వరం తమకు అప్పగిస్తే ఒక్క ఎకరం ఎండిపోకుండా చూస్తామన్నారు. ఎండిపోయిన పంట పొలాల గురించి, రైతన్నల కష్టాల గురించి ఏ ఒక్క మంత్రి కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. దావతుకు పోవడానికి హెలికాప్టర్లు దొరుకుతున్నాయి కానీ ఎండిన పొలాలు పరిశీలించడానికి సమయం దొరకట్లేదా అని ప్రశ్నించారు. ఎండిన పొలాలను, రైతన్నల కష్టాలను ఎక్కిరించడానికి రేవంత్ జిల్లాకు వస్తున్నట్టుందన్నారు. రేవంత్, కాంగ్రెస్ చేసిన మోసానికి రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నారని, వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు.
కరోనా లాంటి కష్ట కాలంలో కూడా రైతాంగానికి చిన్న ఇబ్బంది కలగకుండా కేసీఆర్ నాయకత్వంలో అండగా నిలిచి ఆదుకున్నట్లు తెలిపారు. కేసీఆర్ రూ.10 వేలు ఇస్తే తాము రూ.15 వేలు ఇస్తామని ఆశపెట్టి మోసం చేసిండన్నారు. మంత్రులకు శాఖల గురించి అర్థం కాకపోతే కనీసం అధికారులను అడిగి తెలుసుకుంటే మంచిదన్నారు. కేసీఆర్ ముందుచూపుతో అద్భుత ప్రణాళికతో రాష్ట్రాన్ని ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దిండన్నారు. మళ్లీ తెలంగాణలో ఆంధ్ర బానిసలుగా పాలన కొనసాగిస్తున్న దుస్థితి నెలకొందన్నారు. కనీసం ఒక్క తడికైనా నీళ్లిస్తే కొంత మంది రైతులన్నా అప్పుల బారిన పడకుండా ఉండేవారన్నారు. స్థానిక మంత్రి ఉత్తమ్ స్పందించి ఇంకోక్క తడికన్నా నీళ్లివ్వాలన్నారు. ఈ సందర్భంగా పంట నష్ట పోయిన రైతులు ఎకరాకు రూ.30 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతూ జగదీశ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జులకంటి జీవన్ రెడ్డి, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, జిల్లా నాయకులు గుర్రం సత్యనారాయణ రెడ్డి, ధరావత్ బాబునాయక్, భూక్యా నాగునాయక్ పాల్గొన్నారు.
Jagadish Reddy : కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థికరంగం కుదేలు : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి