చౌటుప్పల్ రూరల్, ఫిబ్రవరి 14 : ఆర్డీఓ సంతకాలను ఫోర్జరీ చేసిన చౌటుప్పల్ పట్టణానికి చెందిన రియల్టర్ వ్యాపారి సుర్వి అంజయ్య, ఐతగోని రాఘవేందర్‌పై శుక్రవారం చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంజయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఐతగోని రాఘవేంద్ర పరారీలో ఉన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణానికి చెందిన సుర్వి అంజయ్య(50) గతంలో చౌటుప్పల్ ఆర్డీఓగా పని చేసిన మహేందర్‌రెడ్డి సంతకాలను చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామానికి చెందిన ఐతగోని రాఘవేంద్ర(45) సాయంతో పోర్జరీ చేసి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి ప్లాట్లుగా విక్రయించాడు.
చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 288/ఏ3/2,289ఏ1/2 నుంచి ఐదెకరాల భూమిని బోరెం భిక్షంరెడ్డి, వెంకటరాంరెడ్డి నుంచి కొనుగోలు చేసి గ్రామపంచాయతీ పర్మిషన్తో ప్లాట్లు విక్రయించారు. 2024 జులై నుంచి నాలా పర్మిషన్ తప్పనిసరి అవడంతో, తమ స్నేహితుల సాయంతో అప్పటి చౌటుప్పల్ ఆర్డీఓ మహేందర్‌రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేయడంతోపాటు ఆర్డీఓ కార్యాలయం స్టాంపులను తయారుచేసి నకిలీ నాలా కన్వర్షన్ కాపీలను తయారు చేశారు.
నకిలీ పత్రాలతో చౌటుప్పల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సమర్పించి అక్రమంగా ప్లాట్లు విక్రయించారు. దీనిపై చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి విచారణ చేసి ఫోర్జరీ జరిగినట్లు నిర్ధారించారు. నిందుతులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన చౌటుప్పల్ సీఐ మన్మదకుమార్ సుర్వి అంజయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏ2గా ఉన్న ఐతగోని రాఘవేంద్ర పరారీలో ఉన్నట్లు తెలిపారు.