మొన్నటివరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఇప్పుడు మైదానంలో మెరికల్లా సాధన చేస్తున్నారు. క్రీడల, యువజన శాఖ ఏర్పాటుచేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో వివిధ ఆటల్లో ప్రావీణ్యం పొందుతున్నారు. కోచ్‌ల యంతో మెళకువలు నేర్చుకుంటూ సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. నల్లగొండ జిల్లావ్యాప్తంగా మొత్తం 13 శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయి.
– నల్లగొండ రూరల్, మే 5
ఏటా పాఠశాలలకు సెలవులు ప్రకటించగానే వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు. కరోనా కారణంగా రెండేండ్లపాటు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఈ సంవత్సరం ప్రభుత్వం పెద్ద సంఖ్యలో క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా జిల్లా క్రీడలు, యువజన శాఖ అధ్వర్యంలో ఈ నెల 1న జిల్లా వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. వీటితోపాటు వేసవి కావడంతో నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ ప్రారంభమైంది. అక్కడ చిన్నారులు ఈత నేర్చుకుంటున్నారు. పలు ప్రైవేటు సంస్థలు సైతం పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నాయి. డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లు పిల్లలతో సందడిగా మారాయి.
– నల్లగొండ రూరల్, మే 5
10 చోట్ల క్రీడా శిబిరాలు
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, పలు అసోసియేషన్ల సంయుక్త అధ్వర్యంలో జిల్లాలో 10 ప్రాంతాల్లో పలు క్రీడా ఉచిత శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, తైక్వాండో క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. తిరుమలగిరిలో వాలీబాల్.. హాలియా, నిడమనూరు, నార్కట్‌పల్లిలో కబడ్డీలో శిక్షణ ఇస్తున్నారు. పెద్దకాపర్తి, ఉరుమడ్లలో హాకీ.. తిప్పర్తి, నార్కట్‌పల్లిలో హ్యాండ్‌బాల్, గుట్టుప్పల్లో బాల్‌బ్యాడ్మింటన్, గుర్రంపోడులో ఫుట్‌బాల్, నార్కట్‌పల్లిలో ఖోఖో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చి తమకు ఇష్టమైన ఆటల్లో శిక్షణ తీసుకుంటున్నారు.
14 ఏండ్లలోపు బాలబాలికలకు ఉచిత శిక్షణ
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్నారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో డిమాండ్ ఉన్న క్రీడల్లో 14 ఏండ్లలోపు బాలబాలికలకు శిక్షణ ఇస్తున్నారు. ఆయా శిబిరాల్లో క్రీడలతోపాటు సాంస్కృతిక, డ్రాయింగ్, పేపర్ క్రాఫ్ట్ వంటి అంశాలపై ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు.
శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
ఆసక్తి గల విద్యార్థులు తమకు నచ్చిన క్రీడా శిబిరాల్లో చేరి నైపుణ్యం మెరుగు పర్చుకోవాలి. ఈ నెల 1నుంచి 31 వరకు శిక్షణ శిబిరాలు కొనసాగుతాయి. ఉదయం 6 నుంచి 8గంటల వరకు, సాయంత్రం 6నుంచి 7గంటల వరకు శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ శిబిరాల్లో పాల్గోనే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యలు కల్పిస్తున్నాం. ఈ వేసవి శిబిరాల్లో పాల్గొని క్రీడా నైపుణ్యం పెంపొందించుకుంటే భవిష్యత్‌లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. శిక్షణ పూర్తి చేసిన వారికి ధ్రువపత్రాలు కూడా అందజేస్తాం.
– మగ్బూల్ అహ్మద్, జిల్లా యువజన, క్రీడల అధికారి, నల్లగొండ
క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్నా
నేను 5వ తరగతి పూర్తి చేశా. నాకు క్రికెట్ అంటే ఇష్టం. నేను, మా తమ్ముడు ఇద్దరం క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్నాం. నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో రోజూ ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు మా కోచ్ క్రికెట్లో మెళకువలు నేర్పిస్తున్నారు. శిక్షణ ఎంతో బాగుంది.
– వరుణ్‌రెడ్డి, విద్యార్థి, నల్లగొండ