నల్లగొండ, జనవరి 5 : గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు బాధ్యతతో విధులు నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో సోమవారం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులకు గ్రామ పాలనపై నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు ఎన్నికలు నిర్వహించే వరకు బాధ్యతలు నిర్వహించాలన్నారు.
ఫిబ్రవరి, మార్చి నెలల్లో తాగునీటి సమస్య ఏర్పడే అవకాశం ఉన్నందున, పరిషారానికి ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. ట్యాంకులు, పైప్‌లైన్ లీకేజీలు రిపేర్ చేయించాలన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యేలకు కేటాయించిన నిధుల నుంచి ఇస్తామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకు రావాలని మంత్రి సూచించారు. కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ ఫిబ్రవరి 7 నుంచి 14వరకు గ్రామపంచాయతీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు తమ విధుల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. పంచాయతీల్లో నిధుల లభ్యత.. ఎంత ఖర్చు పెట్టారో పరిశీలించాలని, తాగు నీటి సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఇంటి పన్నులు, లే అవుట్ అనుమతులు, నాలా ట్యాక్స్ సక్రమంగా వసూలు చేయాలని సూచించారు. పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కోటేశ్వర్రావు మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ పథకం ద్వారా 18 రకాల చేతి వృత్తులకు 5 శాతం వడ్డీతోరూ.లక్ష రుణం అందజేయనున్నట్లు తెలిపారు. 18 నెలల్లో తిరిగి చెల్లించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
దివ్యాంగులకు అండగా ప్రభుత్వం
నల్లగొండ రూరల్ : దివ్యాంగులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని మహిళా శిశు, వయోవృద్ధుల శాఖ అధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు. దివ్యాంగులకు ఆరు వేల పింఛన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివాహ ప్రోత్సాహకాలను త్వరగా విడుదల చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కలెక్టర్ హరిచందన, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, ఆర్డీఓ రవి, డీఈఓ భిక్షపతి, డీఎంహెచ్ఓ కొండల్రావు పాల్గొన్నారు.
ఒకేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు నిర్వహించాలి
జిల్లాలోని ఒకేషనల్ విద్యార్థుల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పాజెక్టు ఏర్పాటు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలెక్టర్ హరిచందనకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ బాలుర, ఒకేషనల్ జూనియర్ కళాశాలల విద్యార్థులకు సోమవారం ఫర్నిచర్, సామగ్రి, ల్యాబ్ పరికరాలు అందజేశారు. ఆయన వెంట డీఐఓ ఆర్.దస్రు, ఫౌండేషన్ చైర్మన్ ఎంవీ గోనారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్స్ నరేందర్‌కుమార్, గోపాల్‌రెడ్డి, ఎండీ ఇస్మాయిల్ ఉన్నారు.