– నల్లగొండ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర
నీలగిరి, మే 13 : కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నల్లగొండ నగరానికి మెరుగైన ర్యాంక్ సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని నల్లగొండ నగర కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర సూచించారు. బుధవారం కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో సెక్షన్ హెడ్లు, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది, టీఎంసీలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, మేప్మా రిసోర్స్ పర్సన్స్, రియు శానిటరీ జవాన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా సిటిజన్ ఫీడ్ బ్యాక్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్ ద్వారా ఫీడ్ బ్యాక్ నమోదు చేయించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పట్టణంలోని అన్ని డివిజన్లలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాలని సూచించారు. నగర ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛమైన నల్లగొండ లక్ష్యంగా కృషి చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించనున్న ఇండీ పప్పీ అడాప్షన్ ప్రోగ్రామ్‌పై ప్రత్యేకంగా చొరవ చూపాలన్నారు. ప్రతి డివిజన్ లోని ఇండీ పప్పీల వివరాలను డివిజన్ వారీగా గుర్తించి నమోదు చేసి అదివారంలోగా పూర్తి చేయాలని మెప్మా రిసోర్స్ పర్సన్స్, వార్డు అధికారులు, శానిటరీ జవాన్లను ఆయన ఆదేశించారు. రాబోయే వారంలో ఇండీ పప్పీ అడాప్షన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రతి కుటుంబం జంతు సంరక్షణ పట్ల బాధ్యతతో దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని, వారందరికి అడాప్షన్ సర్టిఫికెట్తో పాటు ఉచితంగా వ్యాక్సిన్స్ వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వెటర్నరీ, పశుసంవర్ధక శాఖతో సమన్వయం చేసుకుని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిఫల్ డీఈ ఆశోక్, ఏఈ దిలిప్భార్గవ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు గడ్డం శ్రీనివాస్, నంద్యాల ప్రదీప్ రెడ్డి, టీఎంసీ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, మెప్మా సిబ్బంది, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.

‘స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్ బ్యాక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి’