నల్లగొండ రూరల్, ఆగస్టు 07 : నల్లగొండ పట్టణంలో కల్తీ ఆహార అమ్మకాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెండు రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. యాదాద్రి జోన్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్.శివశంకర్ రెడ్డి గురువారం నల్లగొండ పట్టణంలోని పలు హోటళ్లు, బేకరీలు, మాంసాహార దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. హానికార, నిషేధిత రంగులు వాడుతున్న వారికి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ.. అనుమానాస్పద పదార్థాలపై ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనంతో తక్షణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మిల్కోస్కిన్ సహాయంతో పాల నాణ్యత పరీక్షలు నిర్వహించామన్నారు.
అదేవిధంగా పలు రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లు, హోటల్స్‌లో అధిక వేడి చేసిన నూనెలను పరిశీలించి వాటిని అక్కడే పారబోసినట్లు చెప్పారు. పరిశుభ్రత పాటించని పలు హోటళ్లకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. హానికర పదార్థాలు, నిషేధిత రంగులు ఆహార తయారీలో వాడరాదని హెచ్చరించారు. విధిగా ఫుడ్ లైసెన్సులు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యాపారాలపై ప్రజలు ఫుడ్ సేఫ్టీ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. ఆయన వెంట కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
Nalgonda : నల్లగొండలో ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్