నీలగిరి, అక్టోబర్ 28 : మహిళలు గర్భిణులుగా నమోదైన నాటి నుండి ప్రసవం జరిగి చిన్నారులు అంగన్వాడీ కేంద్రానికి వచ్చేంత వరకు వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని బీటీఎస్, దుర్గాకాలనీ, రవీంద్రనగర్ అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ.. రెండు, మూడోసారి గర్భం దాల్చిన ప్రతి స్త్రీ అరోగ్య పరిస్థితితో పాటు వారు డెలివరీ కాగానే కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. రెండు లేదా మూడో కాన్పులో అమ్మాయిలు పుడితే వారు వదిలిచ్చుకునేందుకు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారని, అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా వారిని చైతన్యం చేయాలన్నారు.
ముఖ్యంగా మూడో కాన్సుకు వచ్చిన వారిపై నిఘా ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఎప్పటికప్పుడు గృహ సందర్శనలు చేయాలని సూచించారు. చిన్నారులు, బాలింతలు కనబడకపోతే విచారణ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. శిశు విక్రయాలపై అంగన్వాడీ టీచర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు పార్వతి, సరస్వతి, టీచర్లు గుత్తా రజిత, కె.విజయలక్ష్మి, ఆయాలు, తల్లులు, గర్భిణులు పాల్గొన్నారు.