నీలగిరి, జూలై 19 : కేసుల నమోదులో పోలీసులు పారదర్శకంగా వ్యవహరిస్తున్నందున ప్రతి కేసులోనూ నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్ల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో నిందితులను దోషులుగా నిరూపించి శిక్ష పడేలా పని చేయాలన్నారు. కోర్టు అధికారులు, ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేసి న్యాయమూర్తుల సలహాలు, సూచనలు తీసుకొని విధులు నిర్వర్తించాలన్నారు.
కేసు తుది దశలో సాక్షులను, నిందితులను, బాధితులను సమయానికి కోర్టుకు హాజరు పరిచేలా చూడాలన్నారు. కేసుల్లో నిందితులకు శిక్ష పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, తద్వారా ప్రజలకు పోలీసు శాఖపై మరింత గౌరవం, నమ్మకం పెరుగుతుందన్నారు. ఈ సంవత్సర కాలంలో జిల్లా వ్యాప్తంగా ఒకరికి ఉరిశిక్ష పడగా 10 మందికి జీవిత ఖైదు, వివిధ కేసుల్లో 75 మం దికి శిక్షలు పడటం అభినందనీయమన్నారు.
నిందితులకు శిక్ష పడేలా చేసిన ప్రాసిక్యూటర్, సీడీవో, కోర్టు డ్యూటీ అధికారులను ఎస్పీ అభినందిస్తూ ప్రశంసపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేశ్, డీసీఆర్బీ డీఎస్పీ రవి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శ్రీవాణి, అఖిల, జవహర్ లాల్, రంజిత్ కుమార్, డీసీఆర్బీ సీఐ శ్రీను నాయక్, ఎస్ఐ వెంకట్ రెడ్డి, కోర్టు డ్యూటీ లైనింగ్ ఆఫీసర్ నరేందర్, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.