నీలగిరి, జూన్ 16 : ఈజీగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో నక్సలైట్లమని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ముఠాగా ఏర్పడిన వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో అదివారం విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. మే 28న నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం గణపురం గ్రామ శివారులోని పెద్దమ్మ గుడి శుభ్రం చేయడానికి వెళ్లిన తోటకూరి పెద్ద వెంకటయ్యకు గుడిలో ఒక మూలన మూడు తుపాకులు కనబడగా పోలీసులకు సమాచారం అందించాడు.
ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. గతంలో అక్రమంగా తుపాకులు కలిగిన కేసులో నిందితుడిగా ఉన్న అదే గ్రామానికి చెందిన తోటకూరి శేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు వెల్లడయ్యాయి. ఇటీవల మిర్యాలగూడకు చెందిన గుంటుక రమేశ్ అనే వ్యక్తి జైలులో శేఖర్‌కు పరిచయం అయ్యాడు. వీరిద్దరు కలిసి త్వరగా జీవితంలో స్థిరపడాలని అనుకున్నారు. ఈ క్రమంలో రమేశ్‌కు తెలిసిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌తో కలిసి సూడో నక్సలైట్ల ముఠాగా ఏర్పడ్డారు. తుపాకులతో ధనవంతులను, మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, రోడ్డుపై వెళ్లే వాహనాలు ఆపి బెదిరించి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగా ఏపీలోని విశాఖపట్నం జిల్లా జీకే వీధి సాపర్ల దగ్గరలో తుపాకులను కొనుగోలు చేసి గణపురం గ్రామానికి తెచ్చారు. అయితే.. పెద్ద తుపాకులు కావడంతో బయటకు కన్పిస్తాయని భావించి చిన్న తుపాకుల కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద తుపాకులను కొన్ని రోజులు శేఖర్ తన ఇంట్లో ఉంచుకుని ఎవరైనా చూస్తారని భయపడి గణపురం గ్రామ శివారులో జనసంచారం లేని పెద్దమ్మ తల్లి గుడిలో భద్రపరిచాడు. చిన్న తుపాకుల కోసం అన్వేషిస్తూ ఆదివారం ఉదయం అంగడిపేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న శేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
అతడు ఇచ్చిన సమాచారంతో మిగతా వారిని హైదరాబాద్‌లో అరెస్టు చేసి, మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం నేరమని, ఇతరులను బెదిరించే విధంగా ఆయుధాలు కలిగి ఉన్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌బాబు, కొండ మల్లేపల్లి సీఐ కె.ధనుంజయ్, గుడిపల్లి ఎస్ఐ దోరెపల్లి నర్సింహులు పాల్గొన్నారు.