భువనగిరి అర్బన్, జూన్ 26: ‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి’ అని జిల్లా ఎస్పీ అక్షాంశు యాదవ్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాలతో కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, మత్తు పదార్థాలరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా శుక్రవారం భువనగిరి పట్టణంలో 2కే అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ అక్షాంశు యాదవ్ ప్రారంభించారు. పాత బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ వినాయక చౌరస్తా వరకు కొనసాగింది.
విద్యార్థులు, ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అక్షాంశు యాదవ్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు దూరం గా ఉండాలన్నారు. సమాజంలో మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువకులు ముందుండాలన్నారు. విద్యార్థి దశ నుంచి సమాజంపై మంచి ఆలోచన పెట్టాలన్నారు. సమాజాన్ని బాగు చేయడంతో పాటు మంచి మార్గంలో నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీ రవీందర్, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్‌రెడ్డి, సీఐలు చంద్రబాబు, రమేశ్, ప్రభాకర్‌రెడ్డి, ఎస్ఐలు అనిల్ కుమార్, నరేశ్ పాల్గొన్నారు.