నల్లగొండ, మార్చి 21 : విశ్వ విద్యాయాల్లో చేస్తున్న పరిశోధనలు రైతులకు చేర్చే విధంగా ప్రతి శాస్త్రవేత్త చర్యలు తీసుకోవాలని, దాంతో 25శాతానికిపైగా విస్తరణ సేవలు అందుబాటులోకి వచ్చి సత్ఫలితాలు వస్తాయని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం విస్తరణ డైరెక్టర్ వి.సుధారాణి అన్నారు. నల్లగొండ కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో దక్షిణ తెలంగాణ వ్యవసాయ అధికారుల సలహా మండలి ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజుల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 11జిల్లాలకు సంబంధించిన వ్యవసాయ అధికారులు, ఏరువాక, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు హాజరై 2023 యాసంగి, వానకాలం సీజన్లో పంటల పరిస్థితి, సాధించిన ప్రగతి అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు పూర్తి చేసిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించాలన్నారు. పరిశోధన ఫలితాలు ప్రతి రైతుకు అందించగలిగినప్పుడే ఉపయోగం ఉంటుందని తెలిపారు. శాస్త్రవేత్తలు విస్తరణాధికారులు మమేకమై వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరుస్తూ కొత్త పుంతలు తొక్కించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పప్పు దినుసులు, నూనె గింజల పంటల విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తున్నదని, రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కలిగించాలని చెప్పారు. ప్రతి సీజన్లో రైతుకు కావాల్సిన అవసరాలు తెలుసుకొని ఆ దిశగా ముందుకు సాగాలని తెలిపారు.
మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే వానకాలంలో వేసే పంటల సాగుపై వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏయే పంటలు వేయాలి అనే దానిపై పక్కా ప్రణాళికతో ఉండాలని సూ చించారు. అనంతరం వ్యవసాయ సహ పరిశోధన డైరెక్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది వ్యవసాయ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ రెండు సీజన్లలో రైతుల కోసం చేసిన పరిశోధనలు, వారికి కల్పించిన అవగాహన సదస్సులను వివరించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, ఆయా జిల్లాల వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు భరత్ భూషన్, అనిల్ కుమార్, లక్ష్మణ్, ప్రభాకర్ రెడ్డి, సుల్తాన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.