పెన్పహాడ్, అక్టోబర్ 08 : కన్నతండ్రిపైనే కొడుకులు క్రూరత్వంగా దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మేగ్య తండాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండా వాసుల సమాచారం ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు కుర్వా, కోటమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు పవన్(40), ప్రవీణ్ కుమార్(35). అయితే దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా కోటమ్మ గత 6 సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉంటూ సూర్యాపేటలో వేరే నివాసం ఉంటుంది. కొడుకులిద్దరూ తండ్రి పోషణలోనే ఉన్నారు. సూర్యాపేటలో ఉంటున్న తమ తల్లి కోటమ్మ దగ్గరికి అన్నదమ్ములిద్దరూ తరుచూ వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో తల్లి చెప్పుడు మాటలు విని తండ్రిపై పగ పెంచుకున్నారు. తన భర్తను అంతమొందించడానికి, దాడికి ఉసిగోలిపే విధంగా కొడుకులను పురామహించడం పరిపాటిగా ఉండేదని తండా వాసులు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఆంగోతు కుర్వా నిద్రిస్తుండగా కొడుకులిద్దరూ తండ్రి నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు, కాళ్లు కట్టేసి ఇనుప పైపు, కర్రతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో కుర్వా రెండు కాళ్లు, రెండు చేతులకు తీవ్రగాయాలై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో తండ్రిని ఆటోలో ఆస్పత్రికి తరలిచారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అయితే ఉదయం కుర్వా జాడ లేకపోవడం.. ఆటో వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు తండావాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, తండావాసులు ఆస్పత్రికి చేరుకున్నారు. కుర్వా ఆచూకీ కనుగొని దాడీ వివరాలు సేకరించడంతో తల్లి ఆదేశంతో కన్న కొడుకులే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తేలిందని తండా వాసులు పేర్కొన్నారు.