పెన్‌పహాడ్, అక్టోబర్ 10 : తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. పెన్‌పహాడ్ మండలంలోని మేగ్యా తండాలో కలకలం రేపిన ఘటన వివరాలను రూరల్ సీఐ రాజశేఖర్ శుక్రవారం వెల్లడించారు. తండాకు చెందిన అంగోతు కుర్వా, కోటమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు పవన్ కళ్యాణ్, ప్రవీణ్ కుమార్. వైవాహిక జీవితంలో మనస్పర్ధల కారణంగా కొన్నేండ్లుగా కోటమ్మ తన పిల్లలతో వేరుగా ఉంటూ సూర్యాపేటలో నివసిస్తుంది. అప్పటినుండి కుర్వా తనకున్న 6 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ ముసలి తల్లిని చూసుకుంటున్నాడు.
కాగా భర్తను ఎలాగైనా అంతమొందించి భూమి కాజేయాలనుకున్న కోటమ్మ భర్త కుర్వాను చంపడానికి పథకం పన్నింది. తన కొడుకులను సోమవారం అర్ధరాత్రి తండాకు పంపించింది. ఆ రాత్రి వారు తండ్రి కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి రాడ్, కర్రతో చితకబాది చంపే ప్రయత్నం చేశారు. ఈ లోగా తండావాసులు వస్తారనే భయంతో వారు వెంట తెచ్చుకున్న బైకుపై గాయాలు, అపస్మారక స్థితిలో ఉన్న తండ్రిని సూర్యాపేటకు తీసుకెళ్లి జనరల్ ఆస్పత్రిలో చేర్పించి పరార్ అయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు భార్య కోటమ్మతో పాటు ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పవన్ కళ్యాణ్, ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయగా, భార్య కోటమ్మ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. సీఐ వెంట ఎస్ఐ గోపికృష్ణ, సిబ్బంది లింగరాజు, సైదయ్య ఉన్నారు.