నల్లగొండ ప్రతినిధి/సూర్యాపేట, జనవరి21(నమస్తే తెలంగాణ) : అందరూ ఊహించినట్లుగానే మంగళవారం నుంచి మొదలైన వివిధ ప్రభుత్వ పథకాల ప్రజాపాలన గ్రామసభలు తీవ్ర గందరగోళం నడుమ కొనసాగాయి. గ్రామ సభల్లో వెల్లడించిన లబ్ధిదారుల జాబితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలుచోట్ల నీలదీతలు, అడ్డగింతలు చోటుచేసుకున్నాయి.
ముఖ్యంగా రేషన్‌కార్డులు, ఇందరమ్మ ఆత్మీయ భరోసా పథకాల్లో భారీగా కోత పెట్టారని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. మంజూరైన రేషన్‌కార్డుల్లో ఎక్కువ మంది అర్హులకు చోటుదక్కలేదని పలుచోట్ల ఆగ్రహాం వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాల్లో అధికారులు ప్రజలకు సమాధానం చెప్పలేక తూతూమంత్రంగా ముగించేసి వెళ్లిపోయారు. చాలా చోట్ల జాబితాలో చోటుదక్కని వారే ఎక్కువగా కనిపించగా వారంతా తిరిగి దరఖాస్తులు పెట్టుకునేందుకు ఎగబడ్డారు. మొత్తంగా తొలిరోజు తీవ్ర గందరగోళం నడమ గ్రామ సభలు ముగిశాయి.
నల్లగొండ జిల్లావ్యాప్తంగా తొలిరోజు 223 గ్రామ సభలు, 48 వార్డు సభలు జరిగాయి. వీటిల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించారు. అయితే రైతుభరోసా మినహా మిగతా పథకాల జాబితాలపై ప్రజల నుంచి ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మునుగోడు మండల కేంద్రంలో జరిగిన గ్రామసభలో రేషన్‌కార్డులపై ప్రజలు అధికారులను నిలదీశారు.
కేవలం కొద్దిమంది పేర్లనే ఎలా పెట్టారని మిగతా వారూ ఏమై పోవాలని ఆగ్రహం వ్యక్తం చేయగా కొత్తగా దరకాస్తులు ఇవ్వాలని అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. త్రిపురారం మండలం కేంద్రంలో ఆరు వేల జనాభా ఉంటే ఇక్కడ కేవలం ఐదుగురికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాలో పేర్లు రావడంతో గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పీఏపల్లి మండలం అంగడిపేటలో గతంలో ఇచ్చిన దరఖాస్తులేమయ్యాయని, కొత్తగా దరఖాస్తులు ఎందుకు అని అధికారులను నిలదీశారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని పలువార్డుల్లో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డు జాబితాల్లో చాలా పేర్లు గల్లంతయ్యాయని ప్రజలు ఆగ్రహాహం వ్యక్తం చేస్తే కొత్తగా దరఖాస్తులు తీసుకుని నచ్చజెప్పారు.
చిట్యాల మండలం ఏపూరు, ఎలికట్టె గ్రామాల్లో లబ్ధిదారుల జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులను, భూమి ఎక్కువ ఉన్న వారిని సైతం రేషన్‌కార్డుల జాబితాలో చేర్చారని, అనర్హులను పక్కన పెట్టారంటూ ఆందోళన చేశారు. ఏపూర్‌లో తిరిగి లబ్ధిదారుల జాబితాను చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి అధికారులకు అందజేశారు. చండూరు మున్సిపాలిటీలో నిరుపేదలకు కాకుండా పక్కా ఇండ్లు ఉన్నవారికీ జాబితాలో పేరు రావడంపై మహిళలు అగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ మండలం కంచనపల్లిలో ఆత్మీయ భరోసా తమ పేర్లు ఎందుకు లేవని భూమిలేని మహిళలు నిలదీశారు. ముషంపల్లిలో రేషన్‌కార్డుల జాబితాలో అందరూ భూములు ఉన్న వారే ఉన్నారని, నిరుపేదలకు కార్డులు ఇవ్వరా అని ప్రశ్నించారు.
కట్టంగూరు మండలం పిట్టంపల్లిలో భూములు ఉన్న వారి పేర్లు ఆత్మీయ భరోసా జాబితాలో రావడంపై నిలదీశారు. అదేవిధంగా రుణమాఫీ ఎప్పుడు చేస్తారని కూడా రైతులు ప్రశ్నించడంతో కొద్దిసేపు గందరగోళ నెలకొంది. నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో రేషన్‌కార్డులు, ఇండ్లు లేనివాళ్లు వంద మందకి పైగా ఉంటే కేవలం 20 నుంచి 30 మందికే జాబితాలో పేరు రావడంతో అధికారులతో వాదనకు దిగారు. రుణమాఫీ గురించి కూడా ప్రశ్నించారు.
కనగల్ మండలంలో నిరుపేదలకు కాకుండా భూస్వాముల పేర్లే పథకాల్లో ఉన్నాయని ప్రజలు ఆరోపించారు. శాలిగౌరారం మండలం చిత్తలూరు, వంగమర్తి గ్రామాల్లో కలెక్టర్, ఎమ్మెల్యే పాల్గొనగా ప్రజలు గ్యాస్ డబ్బులు, రుణమాఫీ డబ్బులు పడలేదని ప్రశ్నించారు. నకిరేకల్ మండలం ఓగోడు, నడిగూడెం, నోముల గ్రామాల్లో ధాన్యం బోనస్ డబ్బులు పడలేదని, రుణమాఫీ జరుగలేదని రైతులు నిలదీశారు. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా పేరు రాలేదని ఇంకా ఎన్ని సార్లు దరఖాస్తు చేయాలని అధికారులను ప్రశ్నించారు. ఇలా చాలా చోట్ల ముందే సిద్ధం చేసుకుని వచ్చిన లబ్ధిదారుల జాబితాలపై తీవ్ర
గందరగోళం నెలకొంది.
అర్హులందరికీ పథకాలు అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేర్లు లేకపోవడంతో సూర్యాపేట జిల్లాలోనూ గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. పలుచోట్ల అధికారులతో వాగ్వాదానికి దిగారు. సూర్యాపేట పట్టణంలోని 1వ వార్డు, తిరుమలగిరి మున్సిపాలిటీలోని 4వ వార్డు, కోదాడ మండలం గుడిబండ, మునగాల మండలం నారాయణగూడెంలో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉద్రిక్తతలకు దారి తీసింది. మేళ్లచెరువు మండలం నల్లబండగూడెం, కందిబండ గ్రామాల్లో వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.
మోతె మండలం సిరికొండలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారి పేర్లు రేషన్ కార్డుల జాబితాలో వచ్చాయని నిలదీశారు. ఆత్మకూర్.ఎస్ మండలం నెమ్మికల్‌లో సంపన్న వర్గాలకే కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తుందా అని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వ నిబంధన ప్రకారం ఉపాధిహామీ పథకంలో పది రోజులు పని చేసిన జాబ్‌కార్డు ఉందని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీం కోసం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 24 రోజులు చేసి ఉండాలి అనేది నిబంధన కేవలం పథకాన్ని కుదించడం కోసమేనని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా చోట్ల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఏకపక్షంగా ఎంపిక చేశారని అధికార పార్టీకి చెందిన నాయకులే ప్రశ్నించడం కనిపించింది. క్షేత్ర స్థాయిలో జరిగిన సర్వే ప్రకారం కాకుండా భూమి ఉన్నవాళ్లకు ప్రభుత్వం స్కీమ్‌లను అమలు చేస్తూ ఏమీ లేని వారికి ఇవ్వడం లేదని వాపోయారు.
ప్రస్తుతం గ్రామ సభల్లో చదువుతున్న జాబితాలే తుది జాబితాలు కావని, గతంలో దరఖాస్తులు చేసిన వాటి ఆధారంగా రూపొందించినవని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. వీటిలో అభ్యంతరాలు ఉన్నా, జాబితాలో ఎవరి పేర్లు అయినా లేకపోతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మంగళవారం తొలిరోజు గ్రామ సభలపై అధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తొలిరోజు 233 గ్రామసభలు, 48 వార్డు సభలు ఇబ్బందులు లేకుండా ముగిసినట్లు ప్రకటించారు. కొన్నిచోట్ల జాబితాలో పేర్లు రాలేదన్న విషయాలు తమ దృష్టికి వచ్చాయని, కొత్తగా దరఖాస్తు చేసుకుంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేక అధికారులు గ్రామ సభలను ఓపికగా నిర్వహించాలని, ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత తమదేనని సూచించారు.