– బీసీ సంఘాల నాయకుల డిమాండ్
– నల్లగొండ జిల్లా కేంద్రంలో శ్రీకాంతాచారి వర్ధంతి
రామగిరి, డిసెంబర్ 03 : మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతిని నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల నాయకులు నిర్వహించారు. నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో గల శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. 2009లో తెలంగాణ ప్రకటన కోసం తెలంగాణ ప్రజలు మొత్తం ఎదురుచూస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రకటన వెనుకకు తీసుకోవడాన్ని జీర్ణించుకోలేక హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తాలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ప్రాణత్యాగం చేసుకున్న వ్యక్తి శ్రీకాంతాచారిర అని కొనియాడారు. జై తెలంగాణ అంటూ ప్రాణాలు అంకితం చేసి అమరుడైనట్లు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు తగిన న్యాయం చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని అలాగే స్కిల్ యూనివర్సిటీకి శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా బీసీలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ బహుజనులు మొత్తం ఏకమై సామాజిక తెలంగాణ అంశం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో బీసీలకు జనాభా దామాషాగా ప్రకారం రిజర్వేషన్లు వచ్చేంత వరకు ఉద్యమించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో తెలంగాణ ఉద్యమకారులను, ప్రజా సంఘాలు, బీసీ సంఘాల నేతలను బైండోవర్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు.
ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కంపెనీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటూరు వెంకటాచారి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరెళ్ల విజయ్ కుమార్, జిల్లా కోశాధికారి జేరిపొత్తుల రమేశ్ గౌడ్, ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్, గడ్డం శంకరయ్య చిట్టిమల్ల దశరథ, ఏరుకొండ హరి, బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబోయిన సతీశ్ యాదవ్, అంతం తిరుపతయ్య గౌడ్, డబ్బిక రాజు, పగిళ్ల కృష్ణ పాల్గొన్నారు.