భూదాన్‌పోచంపల్లి, డిసెంబర్ 24 : కళాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన దర్శక దిగ్గజం, పద్మభూషన్ శ్యామ్ బెనగల్‌కు భూదాన్‌పోచంపల్లితో ఎంతో అనుబంధం ఉంది. హైదరాబాదీ అయిన ఆయన సామాన్యుల బతుకు చిత్రాన్ని వెండి తెరపై చూపించారు. ఈ క్రమంలోనే 1985లో చేనేత కార్మికుల సమస్యలు, సహకార సంఘాల వైఫల్యం, సంప్రదాయ వారసత్వ కళ చితికి పోతున్న తీరును కండ్లకు కడుతూ హిందీలో సుస్మన్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నటుడు ఓం పూరి, నటి షబనాఅజ్మీ నటించారు.
ఈ సినిమానూ పోచంపల్లిలోని ప్రముఖ చేనేత కళాకారుడు చిలువేరు రామలింగం ఇంట్లో, చేనేత సహకార సంఘం ఆవరణలో చిత్రీకరించారు. కొంగరి సుందరయ్య అనే చేనేత కార్మికుడి ఇంట్లోనూ షూటింగ్ చేశారు. సుమారు 45 రోజులపాటు చిత్రీకరణ సాగగా, ఆ కాలంలో వాహన సదుపాయం అంతగా లేకపోవడంతో యూనిట్ బృందం 101 దర్వాజల భవనంలో బస చేసింది. శ్యాంబెనగల్తోపాటు ఓం పూరి, షబనా అజ్మీ, పల్లవి జోషి అప్పుడప్పుడు రామలింగం ఇంట్లో బస చేసేవారు.
ఆ ఇంట్లోనే రిహార్సల్స్ చేసేవారు. పచ్చీసు కుర్తా పైజామాను మగ్గంపై నేసే నేత కళాకారుడు చిలువేరు రామలింగం సాయం తీసుకున్నారు. బోనాల పండుగకు బండిపై మగ్గాన్ని ఏర్పాటు చేసి మొగ్గం నేస్తూ దేవాలయాన్ని వెళ్లేలోపు చీరను పూర్తి చేసి అమ్మవారికి సమర్పించారు. ఓంపూరికి మగ్గాన్ని నేర్పించారు. ఈ సినిమాకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. 1987లో విడుదలైన సినిమాను పనోరమ ఫిలిం ఫెస్టివల్, ది చికాగో ఫిలిం ఫెస్టివల్, వానోవర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, సిడ్నీ ఫిలిం ఫెస్టివల్లోనూ ప్రదర్శించారు. సినిమా చిత్రీకరణ సమయంలో పోచంపల్లి ప్రజలతోపాటు చుట్టుపక్కలవాళ్లు నిత్యం ఇక్కడికి వస్తుండేవారు. అలా చిత్ర బృందంలోని ముఖ్యమైన వ్యక్తులపై ప్రత్యేక అభిమానం నింపుకొన్నారు.