యాదాద్రి, జూలై 14 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి నిత్యారాధనలను అర్చకులు గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి స్వామివారికి బాలభోగం చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ఉత్తర దిశ లోపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు. దేవేరులను గజవాహనంపై ఊరేగించారు. స్వామి వారి కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు.
సాయంత్రం స్వామి వారి వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ ఘనంగా చేపట్టారు. రాత్రి 7గంటలకు స్వామివారికి తిరువారాధన చేపట్టి, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి నివేదన చేపట్టిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు శయనోత్సవం జరిపి, ఆలయాన్ని మూసివేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారి దర్శనాలు కొనసాగాయి. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఖజానాకు రూ.8,81,031 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.