దేవరకొండ రూరల్, డిసెంబర్ 15 : గ్రామాల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మంటగలిపిందని, స్థానిక ఎన్నికల్లో ఓట్లతో ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అందరం కలిసికట్టుగా పనిచేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దామని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం దేవరకొండ మండలం ఇద్దంపల్లి, పడమటిపల్లి, తూర్పుపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయడం లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 ఇస్తామని చెప్పిన మహాలక్ష్మి పథకం ఏమైందని ఆయన ప్రశ్నించారు. 12 నెలల బకాయిలు కలిపి ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడిందన్నారు. చేయూత కింద పింఛన్దారులకు రూ.4 వేలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని ఇప్పుడు ముఖం చాటేశారన్నారు. కేసీఆర్ రైతుబంధును పండగలా ఇస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని దండగలా మార్చిందన్నారు. రెండు సీజన్ల రైతు బంధు ఎగ్గొట్టి రైతులను అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. నాడు దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు, నేడు కాంగ్రెస్ పాలనలో వెలవెలబోతున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయి అవార్డుల్లో సగానికి పైగా తెలంగాణకే వచ్చేవని కానీ ఇప్పుడు కనీస నిర్వహణ లేక గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Devarakonda Rural : కాంగ్రెస్ ప్రభుత్వంలో మంటగలిసిన గ్రామాల ఆత్మగౌరవం : మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ట్రాక్టర్లలో డీజిల్ పోయించడానికి, కాలిపోయిన వీధి లైట్లు మార్చడానికి కూడా సర్పంచుల దగ్గర, అధికారుల దగ్గర చిల్లిగవ్వ లేదన్నారు. గ్రామాభివృద్ధి చేసిన సర్పంచులు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోందన్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక వారు ఆత్మహత్యల బాట పడుతున్నట్లు చెప్పారు. పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి దయనీయంగా మారిందని, నిధులు ఇవ్వరు కానీ పనులు జరగాలంటారు. అప్పులు తెచ్చి గ్రామాలను నడపలేక వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపారు. పారిశుధ్యం పడకేసింది. మిషన్ భగీరథ నీళ్లు రాక మళ్లీ బిందెలు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

Devarakonda Rural : కాంగ్రెస్ ప్రభుత్వంలో మంటగలిసిన గ్రామాల ఆత్మగౌరవం : మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్